18 శాతం రాబడి వస్తుందా?

నెలకు రూ.30 వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే  ఆలోచనతో ఉన్నాను. కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం  ఆశించవచ్చు? 18 శాతం వరకూ రాబడి అందుకోవచ్చా?

Published : 08 Mar 2024 00:28 IST

నెలకు రూ.30 వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే  ఆలోచనతో ఉన్నాను. కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం  ఆశించవచ్చు? 18 శాతం వరకూ రాబడి అందుకోవచ్చా?

భాస్కర్‌

మంచి రాబడి రావాలంటే ఈక్విటీ ఆధారిత పెట్టుబడులే మార్గం. కొంతకాలంగా ఈక్విటీ మార్కెట్లు మంచి లాభాలను ఇచ్చిన మాట వాస్తవం. కానీ, ఇదే తీరు మున్ముందూ ఉంటుందని చెప్పడం కష్టమే. మీకు 12 ఏళ్ల వ్యవధి ఉందంటున్నారు. కాబట్టి, మంచి రాబడికి అవకాశాలున్నాయి. మ్యూచువల్‌ ఫండ్లు లేదా షేర్లలో మదుపు చేసినప్పుడు దీర్ఘకాలంలో 12-13 శాతం వరకూ రాబడిని ఆశించడం సహేతుకంగా ఉంటుంది. స్వల్పకాలంలో కొన్ని సందర్భాల్లో 18 శాతానికి మించి ప్రతిఫలం వచ్చిన సందర్భాలు లేకపోలేదు. కానీ, నష్టభయమూ ఉంటుందని మర్చిపోవద్దు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.30వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేయండి. 12 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా నెలనెలా మదుపు చేస్తే 12 శాతం సగటు వార్షిక రాబడి అంచనాతో రూ.97,30,480 అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.


మా దగ్గర రూ.8 లక్షలు ఉన్నాయి. 11 ఏళ్ల మా అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం వీటిని ఏదైనా మంచి రాబడినిచ్చే  పథకంలో మదుపు చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం ఏం చేయాలి?

శ్రీకాంత్‌

ముందుగా మీ పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. దీనికోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోవడం మంచిది. రూ.8లక్షలను ఒకేసారి మదుపు చేయొద్దు. కనీసం ఆరు నుంచి 9 నెలల పాటు క్రమానుగత బదిలీ విధానం (ఎస్‌టీపీ)లో హైబ్రిడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి మళ్లించండి. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే 11 శాతం రాబడితో రూ.22,71,536 అయ్యేందుకు వీలుంది.


దీర్ఘకాలిక అవసరాలు, ఆదాయపు పన్ను మినహాయింపు కోసం నెలకు రూ.15 వేలు మదుపు చేయాలని  ఆలోచిస్తున్నాను. ఈ నేపథ్యంలో నా ప్రణాళిక ఎలా ఉండాలి?

కృష్ణారావు

న్ను ఆదా కోసం సెక్షన్‌ 80సీలో గరిష్ఠంగా రూ.1,50,000 మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. మీరు ఇతర పన్ను మినహాయింపు పథకాల్లో మదుపు చేయకపోతే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌)కు మళ్లించండి. మిగతా రూ.2,500 సాధారణ ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. కనీసం 5-7 ఏళ్లపాటు వేచి చూడగలిగితేనే మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవాలి. స్వల్పకాలంలో నష్టభయం ఉంటుందని గుర్తుంచుకోండి.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని