ఆర్థిక సంస్థల రుణాలు/బ్యాంకు రుణాలు

ఈ రోజుల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టకుండానే రుణాలను అందిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం థర్డ్‌ పార్టీ(మధ్యవర్తి) హామీని అడుగుతున్నాయి. మన దేశంలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రధాన రుణ

Published : 19 Dec 2020 22:04 IST

ఈ రోజుల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టకుండానే రుణాలను అందిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం థర్డ్‌ పార్టీ(మధ్యవర్తి) హామీని అడుగుతున్నాయి. మన దేశంలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రధాన రుణ దాతలుగా వ్యవహరిస్తున్నాయి. సంస్థాగతం కాకపోయినా ప్రైవేటు రుణదాతలను సైతం రుణాల కోసం ఆశ్రయిస్తున్నారు.

వ్యక్తిగత రుణాలు ఈ కారణాల చేత తీసుకుంటున్నారు:

* ఇంటి కొనుగోలు
* పిల్లల ఉన్నత విద్య
* పిల్లల వివాహావసరాలు
* ఇంటి మరమ్మతు
* కారు కొనుగోలు
* వ్యాపార అవసరాలు
* ఆరోగ్య సమస్యలు
- ఉద్యోగులైతే నెలకు రూ. 20,000 కనీస ఆదాయం పొందుతూ, 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసువారై ఉండాలి.
- స్వయం ఉపాధి కలిగిన వారు 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు, రూ. 3,00,000 వార్షిక ఆదాయం ఉన్నవారికి సులువుగా రుణాలను అందిస్తున్నాయి. ఒక్కో బ్యాంకు, ఆర్థిక సంస్థ ఒక్కో విధంగా రుణ ప్రక్రియను నిర్దేశిస్తున్నాయి.
డాక్యుమెంట్ల పరిశీలన:
రుణం కోసం వెళ్లినప్పుడు ఎవరైనా మొదట అడిగేది డాక్యుమెంట్ల గురించే. ప్రధానంగా వ్యక్తిగత గుర్తింపు, చిరునామా గుర్తింపు, ఇటీవలి వేతన పత్రాలు(శాలరీ స్లిప్పులు), 3 నుంచి 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. 
ఒక్కోసారి రుణ దరఖాస్తు పత్రంలో మధ్యవర్తి వివరాలు పూరించాల్సి ఉంటుంది. బ్యాంకులు మధ్యవర్తికి సంబంధించిన గుర్తింపు పత్రాలను సైతం అడుగుతున్నాయి. రుణ ఆమోద ప్రక్రియలో డాక్యుమెంట్ల పరిశీలన ముఖ్యమైనది, ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

బ్యాంకు ఖాతా అవసరం:
బ్యాంకు రుణాన్ని పొందేందుకు కచ్చితంగా ఏదో ఒక బ్యాంకులో ఖాతా ఉండాలి. ప్రైవేటు రుణ సంస్థల నుంచి రుణం పొందేందుకు బ్యాంకు ఖాతా అవసరం ఉండాల్సిన అవసరం లేదు.

అందే సమయం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు పరిశీలన మొదలైనప్పటి నుంచి రూ. 25 లక్షల వరకూ తీసుకునే రుణాలు పొందేందుకు అవసరమయ్యే కాలపరిమితి బాగా తక్కువైపోయింది. బ్యాంకులతో పోల్చితే ఇతర రుణ సంస్థల నుంచి పొందే రుణాలకు తక్కువ సమయం పడుతుంది. ఆన్‌లైన్‌ పరిశీలన చేపట్టే సౌకర్యం ఉన్న బ్యాంకులు సైతం రుణం తొందరగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొత్తం మీద 1 నుంచి 3 రోజుల్లోపు రుణం అందుకునే వీలుంది.

సెక్యూరిటీ, పూచీకత్తు:
బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం పొందేందుకు ఎటువంటి ఆస్తులు తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా మధ్యవర్తిని హామీదారుగా ఉంచాల్సి రావచ్చు. ప్రైవేటు రుణదాతలు, ఇతర రుణ సంస్థలు మనం ఏర్పరుచుకున్న నమ్మకం, పరిచయం ఆధారంగా సెక్యూరిటీ, పూచీకత్తు అవసరం లేకుండా రుణాలను అందిస్తాయి. బ్యాంకులు రుణ వసూలులో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తాయి. ప్రైవేటు రుణదాతలు, రుణ సంస్థలు కాస్త దురుసుగా వ్యవహిరించే అవకాశం ఉంది.

లభ్యత:
బ్యాంకుల రుణాలను వారు నిర్ణయించిన వాయిదాల రూపంలో చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ముందుగా చెప్పిన కారణానికే బ్యాంకు రుణాలను వాడుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు రుణదాతలు లేదా ఇతర రుణ సంస్థల నుంచి పొందిన రుణాలను అవసరాలకు అనుగుణంగా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చేముందు రుణచరిత్ర, సంపాదనా సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. గతంలో క్రెడిట్‌ కార్డు చెల్లింపులు లేదా రుణ చెల్లింపులు సరిగా చేయకపోయినా ప్రస్తుత రుణంపై ప్రభావం ఉంటుంది.

వడ్డీ రేట్లు:
బ్యాంకు రుణాలు సంస్థాగతమైనవి. కాబట్టి బ్యాంకుల నుంచి పొందే రుణాలపై వడ్డీ తక్కువగా ఉంటుంది. బ్యాంకులు వడ్డీ రేట్లతో పాటు, వివిధ రుసుములను విధించడం వల్ల చివరకు బ్యాంకు రుణం కూడా కాస్త ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. బ్యాంకులు వివిధ ఆదాయ వనరులను కలిగి ఉంటాయి. అయితే ప్రైవేటు రుణదాతలు, ఇతర రుణ సంస్థలకు వడ్డీయే ప్రధాన ఆదాయం. కాబట్టి 12 నుంచి 30 శాతం వరకూ వడ్డీ రేట్లు వసూలు చేస్తారు. ఈ విధంగా చూస్తే బ్యాంకు రుణాల విషయంలో మనం తక్కువ భారం వహిస్తాం.

రీపేమెంట్, ఈఎమ్‌ఐ:
బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాల్లో 12 నెలల నుంచి మొదలుకొని 5 ఏళ్ల వరకూ రీపేమెంట్‌ గడువు ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు, ఇతర రుణ సంస్థలు 12 నెలల నుంచి 3 ఏళ్ల వరకూ రీపేమెంట్‌కు సమయం ఇస్తున్నారు. 
ఎక్కువ రీపేమెంట్‌ గడువు ఉన్న రుణాలకు మనం చెల్లించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార అవసరాల కోసం రుణాలు కావాలనుకునేవారు మొదటి ప్రాముఖ్యత బ్యాంకులకే ఇస్తూ ఉంటారు. వ్యాపారంలో ఓ స్థాయికొచ్చిన తర్వాత బ్యాంకు రుణాలు పొందడం పెద్ద కష్టమేమీ కాదు. వృద్ధి చెందుతున్న దశలో బ్యాంకు రుణం పొందడం కష్టం కావచ్చు. వ్యాపారంలో స్థాయిని పెంచుకునే వరకూ తాత్కాలికంగా ప్రైవేటు రుణాలపై ఆధారపడటం సూచనీయం. దాని తర్వాత బ్యాంకు వ్యాపారం పట్ల సంతృప్తి చెందినట్లయితే రుణం సులువుగా అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని