Kotak Mahindra: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు కొత్త బాస్‌.. ఎవరీ అశోక్‌ వాస్వానీ?

Kotak Mahindra Bank New CEO Ashok Vaswan: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కొత్త సీఈఓగా అశోక్‌ వాస్వానీ నియమితులయ్యారు. ఆర్‌బీఐ ఇందుకు ఆమోదం తెలిపింది.

Published : 21 Oct 2023 17:20 IST

Kotak Mahindra | దిల్లీ: ప్రైవేటు రంగ ప్రముఖ బ్యాంక్‌ కోటక్‌ మహీంద్రాకు (Kotak Mahindra) కొత్త సీఈఓ, ఎండీగా ఇంటర్నేషనల్‌ బ్యాంకర్‌ అశోక్‌ వాస్వానీ (Ashok Vaswani) నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. ఈ నియామకానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. కోటక్‌ బ్యాంక్‌ ఎండీగా ఉదయ్‌ కోటక్‌ వైదొలిగిన నేపథ్యంలో తాజా నియామకం చోటుచేసుకుంది. నియామకానికి షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలపాల్సి ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 1లోగా అశోక్‌ వాస్వానీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎవరీ అశోక్‌ వాస్వానీ..?

అశోక్ వాస్వానీకి బ్యాంకింగ్‌ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. గతంలో అంతర్జాతీయ బ్యాంక్‌ సిటీ గ్రూప్‌లో పనిచేశారు. చివరగా బార్‌క్లేస్‌ బ్యాంక్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గానూ వ్యవహరించారు. ప్రస్తుతం యూఎస్‌-ఇజ్రాయెల్‌ ఏఐ ఫిన్‌టెక్‌ పగాయా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌, ఎస్‌పీ జైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ (యూకే) బోర్డు సభ్యులుగానూ ఉన్నారు. ప్రథమ్‌, లెండ్‌ హ్యాండ్‌ వంటి దాతృత్వ సంస్థల్లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. బాంబే యూనివర్సిటీ నుంచి కామర్స్‌, ఎకనమిక్స్‌, అకౌంటెన్సీలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందిన వాస్వానీ.. సీఏ, సీఎస్‌ పూర్తి చేశారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు.

ఇన్‌స్టా యూజర్లకు కొత్త ఫీచర్‌.. కామెంట్‌ సెక్షన్‌లో పోల్స్‌

సొంతింటికి వచ్చినట్లుంది: వాస్వానీ

కోటక్‌ బ్యాంక్‌ సీఈఓ, ఎండీగా నియమితులు కావడం పట్ల వాస్వానీ సంతోషం వ్యక్తంచేశారు. స్వదేశానికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ను నిలిపే ప్రయాణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచస్థాయి బ్యాంకర్‌ అయిన అశోక్‌.. కోటక్‌ బ్యాంక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దగలరని ఉదయ్‌ కోటక్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. కోటక్‌ బ్యాంక్‌ను ఖాతాదారులకు అనుకూల సంస్థగా మార్చేందుకు అశోక్‌ అనుభవం అక్కరకొస్తుందని తాత్కాలిక ఎండీ, సీఈఓ దీపక్‌ గుప్తా పేర్కొన్నారు.

ఇదీ నేపథ్యం..

యెస్‌ బ్యాంక్‌ ఉదంతం నేపథ్యంలో ప్రైవేటు సెక్టార్‌ బ్యాంకుల మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల పదవీ కాలం 15 ఏళ్లు మించకూడదని ఆర్‌బీఐ పరిమితి విధించింది. ఈ నేపథ్యంలో ఉదయ్‌ కోటక్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 1న తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవంగా డిసెంబర్‌ 31 వరకు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ.. ముందుగానే వైదొలిగారు. జాయింట్‌ ఎండీ దీపక్‌ గుప్తా తాత్కాలిక ఎండీగా నియమితులయ్యారు. సీఈఓగా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. బ్యాంక్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడిగా ఉదయ్‌ కోటక్‌ కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని