IRCTC refund: ఐఆర్‌సీటీసీ రిఫండ్స్‌ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?

IRCTC refund process: రైలు టికెట్‌ బుక్‌ చేసినప్పుడు డబ్బులు డెబిట్‌ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.

Published : 13 Mar 2024 18:31 IST

IRCTC refund | ఇంటర్నెట్ డెస్క్‌: రైలు ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేస్తుంటాం.. కొన్నిసార్లు టికెట్‌ బుక్‌ కాకపోయినా ఖాతాలో డబ్బులు మాత్రం డెబిట్‌ అయిపోతుంటాయి. సాంకేతిక కారణాల వల్ల కూడా డబ్బులు కట్‌ అవుతాయి. టికెట్‌ మాత్రం జారీ కాదు. ఇలాంటి సందర్భాల్లో సదరు మొత్తాలను ఐఆర్‌సీటీసీ (IRCTC) రిఫండ్‌ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి రోజుల సమయం పడుతోంది. రైల్వే టికెట్లు బుక్‌ చేసేవారికి తరచూ ఎదురయ్యే సమస్యే ఇది. దీనికి త్వరలో పరిష్కారం లభించనుంది. రిఫండ్‌ ప్రక్రియను ఐఆర్‌సీటీసీ వేగవంతం చేయనుంది. దీంతో గంట లేదా కొన్ని గంటల్లోనే నగదు వెనక్కి రానుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చాయి.

రిఫండ్ల గురించి ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు అన్నిరకాల రిఫండ్లకు ఏకరూపత తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిఫండ్ల జారీకి పడుతున్న సమయాన్ని గణనీయంగా తగ్గించాలని రైల్వే బోర్డు సంబంధిత విభాగాలకు ఈ ఏడాది జనవరిలోనే ఆదేశించింది. ఈ క్రమంలోనే ఐఆర్‌సీటీసీ, ఆ సంస్థకు ఐటీ సేవలందించే సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (CRIS) ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నాయి.

కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!

సాధారణంగా టికెట్లు బుక్‌ కాని సందర్భంలో తదుపరి రోజు ఐఆర్‌సీటీసీ ఆ ప్రక్రియను మొదలుపెడుతోంది. ఆ తర్వాత బ్యాంకులు/ పేమెంట్‌ గేట్‌వేలు ఆ ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి. ఇందుకోసం 3-4 పనిదినాలు పడుతోంది. డెబిట్‌/ క్రెడిట్‌ కార్డు వినియోగించిన సందర్భాల్లో వారం కూడా అవుతోంది. టికెట్టు క్యాన్సిల్‌ చేసుకున్నప్పుడు, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నపుడు టికెట్‌ క్యాన్సిల్‌ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. టీడీఆర్‌ విషయంలో మరింత ఎక్కువ సమయం పడుతోంది. ప్రస్తుతం మానవ సంబంధం లేకుండా అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతున్న వేళ.. రిఫండ్ల జారీకి మాత్రం ఎందుకింత ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ రిఫండ్ల జారీపై దృష్టి సారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని