Updated : 10 May 2022 14:58 IST

గృహ రుణం కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా? ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఇంటి కొనుగోలు కోసం అధిక మొత్తంలో పెట్టుబ‌డి అవ‌స‌రం. కాబ‌ట్టి ఆదా చేసిన డబ్బుతోనే ఇల్లు కొనుగోలు చేయాలంటే చాలా మందికి సాధ్యం కాదు. డౌన్‌పేమెంట్ కోసం ఆదా చేసిన మొత్తాన్ని చెల్లించినా మిగిలిన డ‌బ్బు కోసం రుణం తీసుకోవాల్సి వ‌స్తుంది. ప్ర‌స్తుతం డిజిట‌ల్ టెక్నాల‌జీ అభివృద్ధితో చాలా వ‌ర‌కు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ‌లు ఆన్‌లైన్‌లోనే గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలు క‌ల్పిస్తున్నాయి. అయితే కొనుగోలుదారులు ఆన్‌లైన్ ద్వారా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అవేంటో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ద‌ర‌ఖాస్తు స్వ‌యంగా చేయండి..

ఇంటి వ‌ద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా గృహరుణం కోసం సుల‌భంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే ఇటీవ‌లి కాలంలో సైబ‌ర్ మోసాలు భారీగా పెరిగిపోయాయి. వీటి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో జాగ్ర‌త్తలు అవ‌స‌రం. సాధ్య‌మైనంత వ‌ర‌కూ రుణ‌గ్ర‌హీతే స్వ‌యంగా ద‌ర‌ఖాస్తును పూర్తి చేయ‌డం మంచిది. ద‌ర‌ఖాస్తులో మీ ఆదాయ కేవైసీకి సంబంధించిన వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇందుకోసం ఓటీపీ ఆధారిత లాగిన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. మీరే ద‌ర‌ఖాస్తు నింప‌డం వ‌ల్ల  మీ స‌మాచారం మీ నియంత్ర‌ణలోనే భ‌ద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ద‌ర‌ఖాస్తులో త‌ప్పులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌చ్చు.

ప‌రిశోధ‌న..

గృహ రుణాల‌కు డిమాండ్ పెరిగింది. దీంతో వివిధ ఆర్థిక సంస్థ‌లు, రుణ గ్ర‌హీత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు క‌స్ట‌మైజ్డ్ ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. రుణం కోసం బ్యాంకును ఎంచుకునే ముందు స‌రైన పరిశోధ‌న చేయాలి. ఎంత మొత్తం రుణం కావాలి? వ‌డ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, అనువైన చెల్లింపుల విధానం, ఛార్జీలు, ఇత‌ర నియ‌మ నిబంధ‌నల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ త‌ర్వాత మాత్ర‌మే రుణం కోసం ప్ర‌య‌త్నించాలి. వివిధ బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న గృహ రుణాల‌ను పోల్చి చూసేందుకు ప‌లు ర‌కాల వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పోల్చి చూడొచ్చు. స‌రైన రీసెర్చ్ లేక‌పోతే అన‌వ‌స‌ర‌మైన‌ కార‌ణాల‌తో ఎక్కువ ఛార్జీలు, ఈఎంఐ చెల్లించాల్సి రావ‌చ్చు. కాబ‌ట్టి ముందే స‌మాచారాన్ని సేక‌రించి, అనువైన బ్యాంకులో రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే మంచి ఫ‌లితాలు పొందొచ్చు.

సెక్యూరిటీ..

మీరు ఏ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా రుణం కోసం దర‌ఖాస్తు చేస్తున్నారో.. దాని ISO: 9001, ISO:27001 ధ్రువపత్రాలను ప‌రిశీలించ‌డం కూడా చాలా ముఖ్యం. ఇవి ప్రపంచ స్థాయి డేటా రక్షణ పద్ధతులను అనుసరిస్తాయి. కాబ‌ట్టి సురక్షితమైన లావాదేవీలు అంద‌జేయ‌గ‌ల‌వు. అలాగే మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లయితే, బిల్డర్‌కు ప్రాజెక్ట్ కోసం ఏయే బ్యాంకుల్లో ఏపీఎఫ్‌ ఆమోదం ఉందో తెలుసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఇది లోన్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్..

గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్న‌ప్పుడు చాలా సందేహాలు వ‌స్తుంటాయి. నిపుణుల స‌ల‌హాలు అవ‌స‌రం కావ‌చ్చు. ప్రాసెస్ అనుకున్న‌ట్లుగా పూర్తైతే ప‌ర్వాలేదు. ఏదైనా స‌మ‌స్య ఎదురైతే ప‌రిష్కారం కోసం సిబ్బందితో మాట్లాడాల్సి రావ‌చ్చు.  మీరు ఎంచుకున్న ఫ్లాట్‌ఫాం అవ‌స‌ర‌మైన‌ప్పుడు నిపుణుల స‌హాయం అంద‌జేస్తుందో లేదో ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకోండి. 

చివ‌రిగా..
రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్ యోగ‌త్య‌ను ముందుగా ప‌రిశీలిస్తాయి. అందువ‌ల్ల గృహ‌రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు మంచి క్రెడిట్ స్కోరును నిర్వ‌హించడం చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోరు బాగుంటే త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణం లభించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల వివిధ బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్ల‌ను పోల్చిచూసి రుణం కోసం అప్లై చేయ‌డం మంచిది. డిజిట‌ల్‌గా అప్లై చేసేవారు పైన చెప్పిన విష‌యాల‌లోనూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని