Nilekani: ఐఐటీ బాంబేకి నందన్‌ నీలేకని భూరి విరాళం

Nandan Nilekani- IIT Bombay: ఐఐటీ బాంబేకు నందన్‌ నీలేకని రూ.315 కోట్ల భూరి విరాళం ఇచ్చారు. ఐఐటీ-బితో తనకున్న అనుబంధం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విరాళం సమర్పించారు.

Published : 20 Jun 2023 22:51 IST

ముంబయి: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌, ఆధార్‌ రూపకర్త నందన్‌ నీలేకని (Nandan Nilekani) పెద్ద మనసు చాటుకున్నారు. ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేకు (IIT Bombay) రూ.315 కోట్ల భూరి విరాళం సమర్పించారు. ఈ నిధులను ఐఐటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, ఇంజినీరింగ్‌, టెక్నాలజీలో పరిశోధనలు వంటి వాటికి వినియోగించనున్నారు. దేశంలో ఒక పూర్వ విద్యార్థి ఇంతమొత్తంలో విరాళం సమర్పించడం ఇదే ప్రథమం. గతంలోనూ ఐఐటీ బాంబేకు నందన్‌ నీలేకని రూ.85 కోట్లు విరాళం ఇచ్చారు.

ఐఐటీ బాంబే నుంచి 1973లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసుకున్న నీలేకని.. ఐఐటీ బాంబేతో 50 ఏళ్లుగా తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 1999 నుంచి ఐఐటీ-బాంబే హెరిటేజ్‌ ఫౌండేషన్‌ బోర్డులో దశాబ్దం పాటు కొనసాగారు. 2005 నుంచి 2011 మధ్య గవర్నర్ల బోర్డులో ఒకరిగా ఉన్నారు. గతంలో కొత్త హాస్టల్‌ భవన నిర్మాణం, యూనివర్సిటీ ఇంక్యుబేటర్‌ నిర్మాణానికి రూ.85 కోట్లు నిధులు సమకూర్చారు. 1999లో ఐఐటీ బాంబే నుంచి అలుమ్నస్‌ అవార్డు, 2019లో గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.

నాకెంతో ఇచ్చింది

‘‘ఐఐటీ-బాంబే నా జీవితంలో కీలక మలుపు. నా జీవితానికి ఇక్కడే పునాది పడింది. నన్ను ఎంతో  తీర్చిదిద్దింది. ఈ విద్యా సంస్థతో నాది 50 ఏళ్ల అనుబంధం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈ విరాళం ఇస్తున్నా’’ అని నీలేకని పేర్కొన్నారు. గ్లోబల్‌గా ఐఐటీ-బి ఎదగడానికి ఈ విరాళం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐటీ బాంబే డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుభాశిస్‌ చౌధురి పేర్కొన్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలలో పరిశోధన, అభివృద్ధికి దాతృత్వ సహకారం అందించడానికి నీలేకని సహకారం స్ఫూర్తిగా నిలవనుందని తెలిపారు. ఐఐటీ-బాంబే 1958లో స్థాపితమైంది. దేశంలో ఏర్పాటైన రెండో ఐఐటీ ఇదే. సుమారు 62,500 మంది ఇంజినీర్లు, సైంటిస్టులు ఈ సంస్థ నుంచి ఇప్పటివరకు గ్రాడ్యుయేట్లుగా పట్టాలు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని