Aadhaar update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పెంపు.. కొత్త డెడ్‌లైన్‌ ఇదే..!

Aadhaar update For Free: ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇచ్చిన గడువును ఉడాయ్‌ మరోసారి పొడిగించింది. డిసెంబర్‌ 14 వరకు అవకాశమిస్తోంది.

Published : 07 Sep 2023 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధార్‌ (Aadhaar) వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్‌ వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇచ్చిన గడువును విశిష్ట గుర్తింపు ప్రాధికారి సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. సెప్టెంబర్‌ 14తో ఈ గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలల గడువు పొడిగించింది. అంటే 2023 డిసెంబర్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. గడువు తర్వాత ఆధార్‌ డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

‘‘ఆధార్‌ పోర్టల్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోనేలా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతో గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. సెప్టెంబర్‌ 14తో గడువు ముగియాల్సి ఉండగా ప్రజల సానుకూల స్పందన వస్తుండడంతో గడువు పెంపు నిర్ణయం తీసుకున్నాం. మైఆధార్‌ పోర్టల్‌ ద్వారా 2023 డిసెంబర్‌ 14 వరకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు’’ అని ఉడాయ్‌ ఆఫీసు మొమోరాండంలో పేర్కొంది.

ఆధార్‌కార్డ్‌పై పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?

ఆధార్‌ను వివరాలు నమోదు చేసుకోవడంలో భాగంగా పేరు, జెండర్‌, పుట్టిన తేదీ, అడ్రస్‌ వివరాలను నిర్దేశిత గడువు వరకు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అలానే ఆధార్‌ తీసుకుని 10 ఏళ్లు పూర్తయిన వారూ తమ డెమోగ్రఫిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ సూచిస్తోంది. ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయినప్పుడు గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా వివరాలు అప్‌డేట్‌ చేయని వారు దీనిని వినియోగించుకోవాలని సూచిస్తోంది. ఇందుకోసం ఐడెంటీ ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

అప్‌డేట్‌ సులువుగా ఇలా..

  • ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి ముందుగా మై ఆధార్‌ పోర్టల్‌కు వెళ్లండి.
  • డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ విభాగంంలో పేరు/ జెండర్‌/ పుట్టిన తేదీ/ అడ్రస్‌ అప్‌డేట్‌ ఆప్షన్లలో మీకు కావాల్సింది ఎంచుకోండి.
  • తర్వాత అప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ ఆప్షన్‌ ఎంచుకోండి.
  • తర్వాత సంబంధిత పత్రాలకు స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేయండి.
  • 14 అంకెల Update request number వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని