రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లకు నేడు ప్రత్యేక ప్రీ-ఓపెన్‌ సెషన్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లకు నేడు (గురువారం) ప్రత్యేక ప్రీ- ఓపెన్‌ సెషన్‌ను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) నిర్వహించనుంది. ఇది ఉదయం  9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది.

Updated : 20 Jul 2023 08:56 IST

ఉదయం 9 -10 గంటల మధ్య
ఆర్థిక సేవల విభాగం విభజన నేపథ్యం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లకు నేడు (గురువారం) ప్రత్యేక ప్రీ- ఓపెన్‌ సెషన్‌ను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) నిర్వహించనుంది. ఇది ఉదయం  9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఆర్‌ఐఎల్‌ తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను (జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌-జేఎఫ్‌ఎస్‌ఎల్‌గా పేరు మారనుంది) విభజించి, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తుండటం ఇందుకు నేపథ్యం. విభజన పథకం ప్రకారం..రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదార్లు తమ వద్ద ఉన్న ప్రతి షేరుకు.. ఒక జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేరును పొందుతారు. అంటే 100 ఆర్‌ఐఎల్‌ షేర్లకు 100 జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేర్లు లభిస్తాయి. జులై 20న రికార్డు తేదీగా నిర్ణయించినందున, అప్పటికి రిలయన్స్‌ షేర్లు కలిగి ఉన్నవాళ్లకే ఈ అవకాశం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను కలిగి ఉన్న వాటాదార్లు సుమారు 36 లక్షల మంది ఉంటారని అంచనా.  

ఎందుకు.. ఏం జరుగుతుంది..

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి విభజించిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరుకు స్థిర విలువను ఈ ప్రత్యేక ప్రీ-ఓపెన్‌ సెషన్‌ ద్వారా లెక్కిస్తారు. ఇందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్రితం రోజు ముగింపు విలువ.. ప్రత్యేక సెషన్‌లో వచ్చిన విలువ మధ్య వ్యత్యాసాన్ని ఈ స్థిర విలువగా నిర్థారిస్తారు.

* జియో ఫైనాన్షియల్‌ షేరు స్థిర విలువ రూ.160-190 మధ్య ఉండేందుకు అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. (నోమురా రూ.168; యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రూ.160; జేపీ మోర్గాన్‌ రూ.189; జెఫ్రీస్‌ రూ.179గా ఉండొచ్చని పేర్కొన్నాయి.)

* ప్రత్యేక ప్రి- ఓపెన్‌ సెషన్‌ కారణంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల సాధారణ ట్రేడింగ్‌ ఉదయం  10 గంటలకు ప్రారంభమవుతుంది.

* అందువల్ల ప్రీ-ఓపెన్‌ సెషన్‌లో నిఫ్టీ-50 సూచీ పాయింట్లను లెక్కించేందుకు, ఆర్‌ఐఎల్‌ మినహా మిగతా 49 కంపెనీల షేర్ల విలువలనే పరిగణనలోకి తీసుకుంటారు.


నిఫ్టీపై ప్రభావం ఇలా

* సూచీల్లోని షేర్లకు సంబంధించిన కంపెనీల్లో విలీనాలు, వ్యాపార విభజన లాంటివి చోటుచేసుకున్నప్పుడు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఏప్రిల్‌లో ఎన్‌ఎస్‌ఈ సవరించింది. ఈ ప్రకారం.. సూచీలోని కంపెనీ నుంచి విడదీసిన సంస్థ షేరుకు ప్రత్యేక ప్రీ-ఓపెన్‌ సెషన్‌ నిర్వహిస్తే, ఆ సూచీకి ఆ సంస్థ షేరును తాత్కాలికంగా చేర్చుతారు. ప్రస్తుత విషయానికొస్తే.. ప్రత్యేక సెషన్‌లో నిఫ్టీ 50 సూచీ విలువను 49 కంపెనీల షేర్ల విలువలు, ఆర్‌ఐఎల్‌ క్రితం రోజు ముగింపు ధర, జియో ఫైనాన్షియల్‌ షేరు సున్నా విలువ ఆధారంగా లెక్కిస్తారు.

* ప్రత్యేక సెషన్‌ ముగిశాక.. ఆర్‌ఐఎల్‌ షేరుకు వచ్చిన విలువ, జియో ఫైనాన్షియల్‌ షేరుకు కనుగొన్న స్థిర విలువ ప్రకారం నిఫ్టీ-50 సూచీ స్థాయిలను లెక్కిస్తారు. అంటే.. జియో ఫైనాన్షియల్‌ (షేరు విలువ స్థిరంగా ఉండటంతో) మినహా మిగతా కంపెనీల షేర్ల వాస్తవ విలువల ఆధారంగానే సూచీ విలువ కదులుతుంది.

* జియో ఫైనాన్షియల్‌ షేరు ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యే వరకు.. ఈ షేరుకు కనుగొన్న విలువను రోజువారీ నిఫ్టీ సూచీ విలువ మదింపునకు పరిగణనలోకి తీసుకుంటూనే ఉంటారు.

* ఎక్స్ఛేంజీల్లో షేరు నమోదయ్యాక.. మూడు రోజుల పాటు నిఫ్టీ 50 సూచీలో, 51వ కంపెనీ షేరుగా జియో ఫైనాన్షియల్‌ కొనసాగుతుంది. షేరులో ఒడుదొడుకులు సర్దుమణిగేందుకు ఇది తోడ్పడుతుంది. మూడు రోజులు పూర్తయ్యాక.. అన్ని సూచీల్లో నుంచి జియో ఫైనాన్షియల్‌ షేరును తొలగిస్తారు. జియో ఫైనాన్షియల్‌ షేరు వచ్చే 2-3 నెలల్లో నమోదయ్యే అవకాశం ఉంది.


రిలయన్స్‌ షేరుపై ఎంత ప్రభావం?

2005 జూన్‌ 19న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి నాలుగు సంస్థలను విభజించినప్పుడు.. 2006 జనవరిలో ఈ సంస్థ షేరు 38% పెరిగింది. ప్రస్తుత విభజన నేపథ్యంలో, ఆర్‌ఐఎల్‌ షేరు తాత్కాలికంగా కొంత మేర దిగిరావొచ్చని అంటున్నారు.


మూడో రోజూ దూకుడే..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దూకుడు వరుసగా మూడో రోజైన బుధవారమూ కొనసాగింది. బీఎస్‌ఈలో  షేరు 0.62% పెరిగి రూ.2,840 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.2,855 వద్ద తాజా 52 వారాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. ఎన్‌ఎస్‌ఈలో 0.75%  లాభంతో రూ.2,841.85 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ 3.69% (రూ.68,269.06 కోట్లు) పెరిగి రూ.19,21,434.54 కోట్లకు చేరింది. దేశంలో మార్కెట్‌ విలువపరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని