అంకుర సంస్థలు పదేళ్లలో 300రెట్లు పెరిగాయ్‌: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌

2014లో కేవలం 350 మాత్రమే ఉన్న అంకుర సంస్థలు నేడు 300 రెట్లు పెరిగాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 23:45 IST

దిల్లీ: పదేళ్ల క్రితం కేవలం 350గా మాత్రమే ఉన్న అంకుర సంస్థల సంఖ్య నేడు 300 రెట్లు పెరిగిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఇది సాధ్యమైందని చెప్పారు. భారత్ నేడు ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థను కలిగి ఉందని ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న యూనికార్న్‌లకు నిలయంగా మారిందన్నారు.

‘‘కేవలం ప్రభుత్వ ఉద్యోగమే ఉపాధి కాదనే దిశగా యువతను జాగృతపరిచేందుకు చర్యలు తీసుకున్న ప్రధాని మోదీ..  దానికంటే మెరుగైన జీవనాన్ని అందించే సరికొత్త అవకాశాలను ప్రోత్సహించారు. అంతరిక్ష రంగంలో సరికొత్త అవకాశాలకు తెరతీశారు. గతేడాది చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధృవంపై భారత్‌ కాలుమోపింది. అదే విధంగా ఆదిత్య ఎల్‌1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు స్థానం కల్పించడంతో కేవలం నాలుగేళ్లలోనే స్పేస్‌ స్టార్టప్‌ల సంఖ్య సింగిల్‌ డిజిట్‌ నుంచి నాలుగంకెలకు చేరింది’’ అని కేంద్ర మంత్రి మోదీని కొనియాడారు.

చైనాలో ఎలాన్‌ మస్క్‌ ఆకస్మిక పర్యటన!

‘‘ మోదీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల అంతరిక్షం, రైల్వేలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లతో సహా అనేక రంగాలు వృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. 11వ స్థానంలో ఉన్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఐదో స్థానికి ఎగబాకింది. త్వరలోనే మూడో స్థానానికి చేరుతుంది. 2047 నాటికి మొదటి స్థానంలో నిలుస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని సాధారణ పౌరులు సైతం విశ్వసిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని