Elon Musk: చైనాలో ఎలాన్‌ మస్క్‌ ఆకస్మిక పర్యటన!

Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్‌ మస్క్‌ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు.

Published : 28 Apr 2024 16:10 IST

బీజింగ్‌: టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆదివారం ఆకస్మికంగా చైనా పర్యటనకు వెళ్లారు. బీజింగ్‌లో పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులతో ఆయన సమావేశం కానున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు. విద్యుత్తు వాహనాలకు చైనా రెండో అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. దాదాపు వారం క్రితం మస్క్‌ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

చైనాలో టెస్లా (Tesla) కార్లకు ఇటీవల గిరాకీ తగ్గింది. పోటీ సంస్థల నుంచి అందుబాటు ధరలో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఇటీవల టెస్లా తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించింది. ఈ తరుణంలో మస్క్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు టెస్లా ‘ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్ (FSD)’ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టడంపై కూడా ఆయన ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో టెస్లా (Tesla) మొత్తం డేటాను అక్కడే స్టోర్‌ చేస్తోంది. ‘ఎఫ్‌ఎస్‌డీ’ని ట్రైన్‌ చేయడం కోసం ఆ డేటా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్‌  (Elon Musk) ప్రభుత్వంతో చర్చించనున్నట్లు సమాచారం. త్వరలో ఎఫ్‌ఎస్‌డీని చైనాలో అందుబాటులోకి తీసుకొస్తామని మస్క్‌ ఇటీవల స్వయంగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని