Swiggy: ఉద్యోగులకు స్విగ్గీ గుడ్‌న్యూస్‌.. స్టాక్‌ ఆప్షన్ల బైబ్యాక్‌

ఆహార పంపిణీ సంస్థ స్విగ్గీ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌ కింద కేటాయించిన షేర్లను బైబ్యాక్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. 

Updated : 24 Jul 2023 16:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆహారం, నిత్యావసరాల సరఫరా  సంస్థ స్విగ్గీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ ఉద్యోగుల వద్ద ఉన్న 50 మిలియన్‌ డాలర్లు (రూ.409 కోట్లు) విలువైన ఈఎస్‌ఓపీ (ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌) వాటాలను కొనుగోలు చేయనుంది. భారత స్టార్టప్‌లలో ఫండింగ్‌ మందగించడంతో చాలా సంస్థలు నిధుల ఆదా.. లేదా నిధుల అవకాశాలను పెంచుకొంటున్న వేళ స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకొంది.  స్విగ్గీ వద్ద ఉన్న మొత్తం 5,000 మందిలో 2,000 మంది నుంచి ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. వీరిలో డైన్‌ఔట్‌ నుంచి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. 

2021లో ఈఎస్‌ఓపీ షేర్లను కొనుగోలు చేస్తామని స్విగ్గీ ప్రకటించింది. 2021, 2022లో ఉద్యోగుల  పనితీరుకు నజరానాగా ఈ నిర్ణయం తీసుకొంటామని పేర్కొంది. 2018 నుంచి మొత్తం నాలుగు సార్లు ఈఎస్‌ఓపీలను బైబ్యాక్‌ చేసింది. ప్రతిసారి ఈ బైబ్యాక్‌ మొత్తాన్ని పెంచుకొంటూ వస్తోంది. 2018లో 4 మిలియన్‌ డాలర్లు విలువైన షేర్లను కొనుగోలు చేయగా.. ఆ తర్వాత సంవత్సరంలో 9 మిలియన్‌ డాలర్లను బైబ్యాక్‌ చేసింది. ఇక 2022లో 23 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. తాజాగా ఈ మొత్తం 50 మిలియన్‌ డాలర్లకు చేరింది.  

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం.. కేంద్రం ఓకే

‘‘మా బృందమే అత్యంత విలువైన ఆస్తి. మా ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. ఈ విజయాన్ని పంచుకొనేలా.. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొంటున్నాం’’ అని స్విగ్గీ మానవ వనరుల విభాగం అధిపతి గిరీష్‌ మేనన్‌ వెల్లడించారు. ఎంత రేటు వద్ద స్విగ్గీ ఈ షేర్లను కొనుగోలు చేస్తోందో మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం స్విగ్గీ మార్కెట్‌ విలువ జొమాటో విలువతో సమానంగా ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గతేడాది ఫండ్స్‌ సమీకరణ సమయంలో స్విగ్గీ విలువ 10.7 బిలియన్‌ డాలర్లుగా అంచనావేశారు. కానీ, ఆ తర్వాత పలు కారణాలతో ఈ సంస్థ విలువను తగ్గించారు. మరో వైపు కంపెనీ సీఈవో శ్రీహర్ష మాజేటీ మాట్లాడుతూ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉందన్నారు. డైన్‌ఔట్‌, ఇన్‌స్టామార్ట్‌ వంటివి నిలకడగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు.  

ఈ నిర్ణయంతో తమ ఉద్యోగులకు రివార్డులు అందించిన స్టార్టప్‌ల జాబితాలో స్విగ్గీ కూడా చేరింది. ఈ నెల మొదట్లో ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ 19,000 మంది ఉద్యోగులకు దాదాపు 700 మిలియన్‌ డాలర్లను చెల్లించింది. ఫోన్‌పే నుంచి విడిపోయిన వెంటనే ఈ నిర్ణయం తీసుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని