FasTag: పేటీఎం ఫాస్టాగ్‌ వాడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవే..!

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ జారీ చేసిన ఫాస్టాగ్‌లు త్వరలో చెల్లుబాటుకాకుండా పోనున్నాయి. దీంతో కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ..

Published : 26 Feb 2024 18:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm payments bank) జారీ చేసిన ఫాస్టాగ్‌ (FasTag) వాడుతున్నారా? అయితే, త్వరలో మీరు కొత్తది కొనుగోలు చేయాల్సిందే. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఆ ఫాస్టాగ్‌లను మార్చి 15 తర్వాత రీఛార్జి చేయడానికి కుదరదు. అందులో నగదు పూర్తయ్యే వరకే వినియోగించే వెసులుబాటు ఉంది. ఇప్పటికే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (IHMCL).. ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)ను తొలగించింది. కాబట్టి పేటీఎం ఫాస్టాగ్స్‌ను వాడుతున్నవారు.. కొత్త వాటికి మారాల్సి ఉంటుంది. కొత్త ఫాస్టాగ్‌కు తొలుత జాయినింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొంత మొత్తం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించాలి. ఫాస్టాగ్‌ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఆపై ఫాస్టాగ్‌ను ఎప్పటికప్పుడు రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీ.. పైగా పన్ను మినహాయింపు.. VPF ప్రయోజనాలివే..!

ప్రత్యామ్నాయాలు ఇవీ..

  • NHAI ఫాస్టాగ్‌: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) స్వయంగా ఫాస్టాగ్‌లను జారీ చేస్తోంది. ఇది ప్రత్యేకంగా ఏ బ్యాంకుకూ అనుసంధానమై ఉండదు. టోల్‌ ప్లాజాలు, పెట్రోల్‌ పంపులు వద్ద వీటిని కొనుగోలు చేయొచ్చు. ‘మై ఫాస్టాగ్‌’ యాప్‌ ద్వారా లేదా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఇ-కామర్స్ సంస్థల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు.
  • ఎస్‌బీఐ  ఫాస్టాగ్‌ : ప్రభుత్వరంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (SBI) చెందిన ఫాస్టాగ్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవచ్చు. ఇందుకోసం వన్‌టైమ్‌ ఫీజు కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. రూ.100తో కనీస రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.లక్ష వరకు రీఛార్జి చేసుకోవచ్చు.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫాస్టాగ్‌: ప్రైవేటు రంగానికి హెచ్‌డీఎఫ్‌ సైతం ఫాస్టాగ్‌లను జారీ చేస్తోంది. రూ.100 వన్‌టైమ్‌ ఫీజు కింద చెల్లించాలి. మరో రూ.100 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. రూ.100 నుంచి రూ.లక్ష వరకు ఎంతైనా రీఛార్జి చేసుకోవచ్చు. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా దగ్గర్లోని బ్యాంక్‌ శాఖకు వెళ్లి పొందొచ్చు.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫాస్టాగ్‌: ఐసీఐసీఐ ఫాస్టాగ్‌ను బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా గానీ, బ్రాంచ్‌లో గానీ పొందొచ్చు. ఈ బ్యాంక్‌లో జాయినింగ్‌ ఫీజు రూ.100, సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.200గా ఉంది.
  • యాక్సిస్‌ బ్యాంక్‌ ఫాస్టాగ్‌: ఇతర బ్యాంకుల మాదిరిగానే ఫాస్టాగ్‌కు యాక్సిస్‌ బ్యాంక్‌లో తొలిసారి రూ.100 చెల్లించాలి. ఆపై సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 చెల్లించాలి. బ్యాంక్‌ వెబ్‌సైట్‌, బ్యాంక్‌ శాఖ వద్ద ఫాస్టాగ్‌ను పొందొచ్చు. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ రూ.100 చెల్లిస్తే ఫాస్టాగ్‌ జారీ చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.150 చెల్లించాలి.

ఇవికాకుండా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా, ఐడీబీఐ, కోటక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌, పంజాబ్‌ నేషనల్‌ వంటి కమర్షియల్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఫాస్టాగ్‌లను జారీ చేస్తున్నాయి. ఆయా బ్యాంక్‌ వెబ్‌సైట్లలోకి వెళ్లి ఫాస్టాగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులూ ఇదే తరహా ఫీజును వసూలు చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని