తమిళనాడులో నరమాంస భక్షకుల కలకలం.. 10మందిపై కేసు!

తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో నరమాంస భక్షకుల వీడియో కలకలం రేపుతోంది. నరమాంసం తిన్నారన్న అభియోగంపై.....

Published : 28 Jul 2021 01:44 IST

తెన్‌కాశి: తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో కొందరు మాంత్రికులు పుర్రెతో నృత్యాలు చేసిన వీడియో కలకలం రేపుతోంది. వారంతా నరమాంసం తిన్నారన్న అభియోగంపై పోలీసులు 10మందిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెన్‌కాశిలోని కల్లురాణి గ్రామంలో జరిగిన ఓ వేడుకలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో ఆ గ్రామ పాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కట్టు కోవిల గుడిలో ఎవరి మృతదేహాన్ని భక్షించారో తెలుసుకొనేందుకు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై పోలీసులకు ఇంకా ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు.

ఆ సమయంలో మాంత్రికులు మత్తులో ఉన్నారని, ఆ గ్రామ దేవత వారిని ఆవహించిందని పేర్కొంటున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, సగం కాలిన మృతదేహాన్ని ఏదైనా గ్రామంలోని శ్మశానవాటిక నుంచి  తీసుకొచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019లో కూడా ఇదే గ్రామంలో కొందరు వ్యక్తులు మనిషి పుర్రెను తీసుకొచ్చి ఇదే తరహాలో ప్రదర్శించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని