Crime News: సాగర్‌ కాలువలోకి దూసుకెళ్లిన కారు:ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి బంధువుల మృతి

గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలోని సాగర్‌ కుడి కాలువలోకి మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

Updated : 12 Jan 2022 06:22 IST

విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులు

మాచర్ల, దుర్గి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలోని సాగర్‌ కుడి కాలువలోకి మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్‌మోహనరెడ్డి క్షేమంగా బయటపడగా, ఆయన భార్య లావణ్య, కూతురు సుదీక్ష మృతి చెందారు. సంక్రాంతి నేపథ్యంలో దుస్తుల కొనుగోలుకు మదన్‌మోహనరెడ్డి భార్య, కుమార్తెతో కలిసి ఉదయం విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అడిగొప్పల దాటాక ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న మదన్‌మోహనరెడ్డి అతికష్టంమీద ఈదుకుంటూ బయటకు రాగలిగారు. నీటి ప్రవాహా ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కారు కోసం రాత్రి నుంచి గాలించారు. వీరి కారు సాగర్‌ కాలువలో పడిందనే సమాచారం అధికారులకు తెలపడంతో బుగ్గవాగు రిజర్వాయర్‌ వద్ద నీరు దిగువకు వెళ్లకుండా నిలిపేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో భారీ క్రేన్‌ సహాయంతో కారును కాలువ నుంచి బయటికి తీశారు. దీంతో లావణ్య, చిన్నారి సుదీక్ష మృతదేహాలు బయటపడ్డాయి. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలంలో ఉండి పర్యవేక్షించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని