Crime news: పదో తరగతి బాలికపై ఘోరం.. హోటల్‌కు తీసుకెళ్లి ఐదుగురి అఘాయిత్యం!

గురుగ్రామ్‌లో పదో తరగతి చదువుతున్న బాలికపై శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులు హోటల్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు బాలిక స్నేహితులే ఉండటం గమనార్హం.

Published : 01 Nov 2022 02:09 IST

గురుగ్రామ్‌: దిల్లీ రాజధాని పరీవాహక ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. హరియాణాలోని గురుగ్రామ్‌లో పదో తరగతి చదువుతున్న బాలికపై శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులు హోటల్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు బాలిక స్నేహితులే ఉండటం గమనార్హం. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల తన కుమార్తె శనివారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిందని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. ఇంటికి దగ్గర్లో ఉన్న పార్కుకు వాకింగ్‌కు వెళ్లి ఉంటుందని తొలుత భావించానని.. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురై వెతకగా కనిపించలేదని ఆమె పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం 10గంటల సమయంలో ఇంటి సమీపంలో తన కుమార్తెను గుర్తించినట్టు ఆమె ఫిర్యాదులో తెలిపారు. 

రాత్రంతా ఎక్కడికి వెళ్లావని అడగ్గా.. తన స్నేహితులు ఇద్దరు బైక్‌పై ఎక్కించుకొని హోటల్‌కు తీసుకుపోయారని.. వారితోపాటు మరో ముగ్గురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు బాలిక తన తల్లికి తెలిపింది. ఎక్కడైనా ఈ విషయం చెబితే చంపేస్తామని కూడా బెదిరించారని వాపోయింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని బాధితురాలికి సివిల్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై డీసీపీ దీపక్‌ సహరన్‌ మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని.. వారిని విచారిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఈ కేసులో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని