TS news: నిరుద్యోగులకు టోపీ పెట్టిన కిలాడీ దంపతులు

ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ఆ కిలాడీ దంపతులు ఆశ పెట్టారు. రూ.లక్షలు వసూలు చేసి కుచ్చు టోపీ పెట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మోసాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. వివరాలను వరంగల్‌ సీపీ తరుణ్‌ జోష...

Published : 23 Nov 2021 02:09 IST

హన్మకొండ: ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ఆ కిలాడీ దంపతులు ఆశ పెట్టారు. రూ.లక్షలు వసూలు చేసి కుచ్చు టోపీ పెట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మోసాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. వివరాలను వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి వెల్లడించారు. హన్మకొండ జిల్లా శాయంపేటకు చెందిన వినయ్‌పాల్‌రెడ్డి ములుగు జిల్లాలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడే రెవెన్యూ విభాగం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్న అనసూయను పెళ్లి చేసుకున్నాడు. అడ్డదారుల్లో సంపాదించాలనే దుర్బుద్ధితో నకిలీ దస్తావేజులు, డాక్యుమెంట్లు తయారు చేసి సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. అవినీతి ఆరోపణలపై 2012లో ఉద్యోగం నుంచి తొలగించారు.

ఆ తర్వాత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆర్గనైజేషన్ పేరుతో నకిలీ ఐడీ కార్డులు సృష్టించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దంపతులు డబ్బులు వసూలు చేశారు. వినయ్‌పాల్ రెడ్డి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆర్గనైజేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ విభాగానికి, అనసూయ తెలంగాణ విభాగానికి కమిషనర్లుగా, సాకేత్‌ అనే వ్యక్తి సహాయ కమిషనర్‌గా అవతారమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగుల నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారు. 241 మంది నిరుద్యోగులకు వరంగల్‌, నల్గొండ ప్రాంతాల్లో  15 రోజుల శిక్షణ కూడా ఇచ్చారు. వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తించాల్సిందిగా నకిలీ ఉత్తర్వులిచ్చి బురిడీ కొట్టించారు. ఉద్యోగాలొచ్చాయని ఆనందంతో పాఠశాలకు వెళ్లిన నిరుద్యోగులకు అవి నకిలీవని తేలడంతో కంగుతిన్నారు. ఉద్యోగం రాకపోగా..డబ్బులు పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధితో పాటు నల్గొండ, మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోనూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి వసూళ్లకు పాల్పడ్డారు. వరంగల్‌ పరిధిలోనే 40 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.21.7లక్షల నగదు, రెండు ఖరీదైన కార్లు, రెండు సెల్‌ఫోన్లు, నకిలీ గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోసపోయిన వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉద్యోగాలిస్తామంటూ నకిలీ సంస్థలు చేసే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని నిరుద్యోగులకు సూచించారు.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని