Drugs: విశాఖ తీరంలో డ్రగ్స్‌ కలకలం.. కంటైనర్‌లో 25వేల కిలోల సీజ్‌

విశాఖ తీరంలో డ్రగ్స్‌ కలకలం రేగింది. బ్రెజిల్‌ నుంచి విశాఖకు కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్‌ వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

Updated : 21 Mar 2024 23:11 IST

విశాఖ: విశాఖ తీరంలో డ్రగ్స్‌ కలకలం రేగింది. బ్రెజిల్‌ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్‌ సమాచారంతో దిల్లీ సీబీఐ.. విశాఖలోని సీబీఐ, కస్టమ్స్‌ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈనెల 19న నార్కోటిక్స్‌ సామగ్రి, నిపుణులతో వచ్చిన సీబీఐ డ్రగ్స్‌ ఉన్నట్టు నిర్ధరించుకుంది. ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారులు వాటిని సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్‌ మీదుగా ఈ నెల 16న కంటైనర్‌ విశాఖకు వచ్చినట్లు గుర్తించారు. ఓ ప్రైవేటు కంపెనీ 25 కిలోల చొప్పున  1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్‌ కలకలం ఘటనపై ప్రైవేట్‌ ఆక్వా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కున్నం హరికృష్ణ స్పందించారు. ‘‘ఈ ఏడాది కొత్త ఫీడ్‌ ఫ్యాక్టరీ ప్రారంభించాం. డ్రై ఈస్ట్‌ మాకు ముడి పదార్థం. బ్రెజిల్‌ నుంచి ఈ సరకు తెప్పించాం. జనవరి 14న బ్రెజిల్ నుంచి సరకుతో నౌక బయలు దేరింది. ఈనెల 16న సరకు కంటైనర్‌లో విశాఖకు వచ్చింది. 19న సీబీఐ బృందం సరకును పరిశీలించారు. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు చెప్పి.. సరకును పరీక్షకు తీసుకెళ్లారు. రేపు (శుక్రవారం) మళ్లీ చెకింగ్‌ జరుగుతుంది. అసలు ఏం జరిగిందో తెలియదు. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. మేము సీబీఐ విచారణకు సహకరిస్తున్నాము’’ అని హరికృష్ణ పేర్కొన్నారు. 

‘‘25 వేల కేజీల డ్రై ఈస్ట్‌ను ఆర్డర్ చేసాం. రావలసిన సమయం కంటే ఆలస్యంగా నౌక విశాఖ చేరింది. జనవరి 14న బ్రెజిల్‌లో బయలుదేరి మార్చి 16న విశాఖ చేరింది. మార్చి 19న దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం రెండు రోజులు తనిఖీలు చేపట్టింది. రొయ్యల మేత తయారీకి సరకు ఆర్డర్ చేశాం. సరకులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని సీబీఐ చెబుతోంది. మరోసారి పరీక్ష నిర్వహిస్తామని దర్యాప్తు సంస్థ చెప్పింది’’ అని ప్రైవేట్‌ ఆక్వా వైస్‌ ప్రెసిడెంట్‌ గిరిధర్‌ పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని