
లష్కరే ఉగ్రవాది అరెస్టు
శ్రీనగర్: లష్కరే తొయిబా ఉగ్రవాది నిసార్ అహ్మద్ దార్(23)ను జమ్ము కశ్మీర్ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు. శ్రీనగర్‌లోని మహారాజా హరి సింగ్ హాస్పిటల్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. ఉగ్రవాది నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసు అధికారి ఇంతియాజ్ హుస్సేన్ చెప్పిన వివరాల ప్రకారం.. ఉత్తర కశ్మీరులోని బందీపోర జిల్లా హాజీన్ ప్రాంతానికి చెందిన నిసార్ దార్.. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో 2018లో చేరాడు. అంతకు ముందు నుంచే ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. గతేడాది నవంబర్‌లో గందేర్బల్ జిల్లాలోని కుల్లాన్ గ్రామంలో జరిగిన ఓ ఎన్కౌంటర్ నుంచి నిసార్ తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఈ సారి భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల సంయుక్త చర్యలో ఈ ఉగ్రవాది చిక్కినట్టు హుస్సేన్ తెలిపారు. నిసార్ దార్ మీద అనేక ఉగ్రవాద నేరారోపణలతో పాటు ఎనిమిది ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని పోలీసు అధికారులు వివరించారు. ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిసార్ గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడని కూడా పోలీసు వర్గాలు తెలిపాయి. భద్రతా బలగాలపై దాడి చేయటానికి ఈ ఉగ్రవాది ప్రణాళిక రచిస్తున్నాడని అనుమానిస్తున్నారు. నిసార్ దార్ నుంచి మరింత సమాచారం రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.