కరోనా: అంత్యక్రియలు అడ్డుకున్నవారిపై కేసులు!

కరోనా వైరస్‌ సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు స్థానికులే అడ్డుపడిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి శ్వాసకోస సంబంధ కారణాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు

Published : 11 Apr 2020 00:28 IST

జలంధర్‌(పంజాబ్): కరోనా వైరస్‌ సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు స్థానికులే అడ్డుపడిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి శ్వాసకోస సంబంధ కారణాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆవ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించాడని వైద్యులు ప్రకటించారు. దీంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు అంత్యక్రియలు జరపడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో కరోనా సోకిన వ్యక్తికి తమ ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించవద్దని స్థానికులు నిరసనకు దిగడంతోపాటు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులు, పోలీసులు  నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అంత్యక్రియలకు అడ్డుతగిలే ప్రయత్నం కొనసాగించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు.. అంత్యక్రియలు అడ్డుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ స్థానికులు వినకపోవడంతో అంత్యక్రియలకు ఆటంకం కలిగించిన దాదాపు 60మందిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనల పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని జలంధర్‌ పోలీసు కమిషనర్‌ గురుప్రీత్‌ సింగ్‌ భుల్లార్‌ ప్రకటించారు.

పంజాబ్‌లో ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గతవారం లుధియానాలో కరోనా సోకి మరణించిన ఓ మహిళ అంత్యక్రియలను కూడా అక్కడి గ్రామస్థులు అడ్డుకున్నారు. మరో ఘటనలో పద్మశ్రీ గ్రహీత కరోనాతో మరణించడంతో అమృత్‌సర్‌లోని ఆయన స్వగ్రామం వెర్కాలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా గ్రామ ప్రజలు అడ్డుతగిలారని అధికారులు పేర్కొన్నారు. వైరస్‌ సోకి మరణించిన వారికి తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించడం వల్ల వైరస్‌ తమకు కూడా సోకుతుందనే అపోహతో గ్రామస్థులు ఇలా చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఉన్నతాధికారులు, మంత్రులతోపాటు పలు రాజకీయ నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మృతిచెందిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన పంజాబ్‌కి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులను ఐసోలేషన్‌లో ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని