నాన్నా.. ఏడవడం నా తప్పా...!

అభం శుభం తెలియని చిన్నారి.. ఆకలయినా.. బాధయినా ఏడుపే తన భాష. అయితే ఆ భాషే తన పాలిట శాపంగా మారింది....

Published : 23 Jun 2020 01:05 IST

ఎర్నాకులం: అభం శుభం తెలియని చిన్నారి.. ఆకలైనా.. బాధయినా ఏడుపే తన భాష. అయితే ఆ భాషే తన పాలిట శాపంగా మారింది. తన తండ్రికి తన కూతురి భాష ఎంత మాత్రం నచ్చలేదు.. మద్యం మత్తులో తనను తానే మర్చిపోయాడు.. తన బాధను ఎలా చెప్పాలో తెలియక ఏడుస్తున్న ఆ పసికందు పట్ల పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.. ఫలితం తండ్రి దాడిలో గాయపడి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది ఆ పసికందు. హృదయాలను ద్రవింపజేసే ఈ అమానవీయ ఘటన కేరళ రాష్ట్రం ఎర్నాకులం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

ఎర్నాకులానికి చెందిన ఓ వ్యక్తి తన 54 రోజుల వయసున్న కుమార్తె రాత్రంతా ఏడుస్తూనే ఉందన్న  కారణంతో ఆమె తలపై కొట్టి మంచంపై విసిరేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని మంచంపై నుంచి పడిపోయిందని చెప్పి ఆస్పత్రిలో చేర్పించే ప్రయత్నం చేశాడు. అతడి మాటలపై అనుమానం వచ్చిన ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. రంగంలోకి దిగిన పోలీసులు పాప తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే గాయపరిచినట్లు అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ని అరెస్ట్‌ చేశారు.ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు పాప తల్లి పేర్కొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పసికందును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మెదుడులో రక్తస్రావం కావడంతో ఆపరేషన్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని