అంచెలంచెలుగా దోచేస్తారు!

దర్యాప్తు సంస్థలకు దొరక్కుండా ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు మరో పంథాకు తెరతీశారు. ‘అంచెలంచెలు’గా డబ్బులు కొల్లగొడుతున్నారు.

Published : 30 Jan 2023 03:52 IST

సైబర్‌ నేరగాళ్ల ‘మాడ్యులర్‌ ఎటాక్స్‌’

దర్యాప్తు సంస్థలకు దొరక్కుండా ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు మరో పంథాకు తెరతీశారు. ‘అంచెలంచెలు’గా డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇందులో వ్యూహం పన్నేది ఒకరైతే సాంకేతిక సాయం అందించేది మరొకరు.. డబ్బు దోచుకునేది ఇంకొకరు. ఒకరితో మరొకరికి ఏమాత్రం సంబంధం ఉండదు. ఇలాంటి నేరాలను సైబర్‌ నిపుణులు ‘మాడ్యులర్‌ ఎటాక్స్‌’గా పిలుస్తున్నారు. ఇప్పటికే సైబర్‌ నేరాల దర్యాప్తులో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న పోలీసులకు దీంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.


‘మ్యూల్‌ ఖాతాల’ ద్వారా..

ఫోన్‌ ద్వారా మాయమాటలు చెప్పి బోల్తాకొట్టించే నేరగాళ్లు, అలా కొల్లగొట్టిన డబ్బును అమాయకుల ఖాతాల్లో పడేలా చేస్తారు. వీటిని ‘మ్యూల్‌ అకౌంట్స్‌’ అంటారు. ఊళ్లలో నిరుపేదలు, నిరక్షరాస్యుల బ్యాంకు ఖాతాలను ఇందుకోసం వాడుకుంటారు. వారి డెబిట్‌కార్డులను తమవద్ద పెట్టుకొని.. డబ్బు ‘మ్యూల్‌ ఖాతా’ల్లో పడగానే నేరగాళ్లు డ్రా చేసుకుంటారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినా బాధితులకు వచ్చిన ఫోన్‌ నంబర్లలో తప్పుడు చిరునామాలు ఉంటాయి. డబ్బు జమ అయిన ఖాతా చిరునామా ఆధారంగా ఖాతాదారును పట్టుకున్నా, నేరంతో ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరో అపరిచితుడు తన ఖాతా వాడుకున్నాడని, ప్రతిఫలంగా కొంత డబ్బు ముట్టచెప్పాడని చెబుతుంటారు. సైబర్‌ నేరాలకు అడ్డాలుగా మారిన ఝార్ఖండ్‌లోని ఝాంతారా, రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ తదితర ప్రాంతాల్లో ఇలా మ్యూల్‌ ఖాతాలు సేకరించిపెట్టే ముఠాలు పనిచేస్తున్నాయి. కొందరు బ్యాంకు అధికారులతోనూ సంబంధాలు పెట్టుకొని, నిరుపయోగంగా ఉన్న ఖాతాలను సేకరించి నేరగాళ్లకు చేరవేస్తుంటారు.


ఆర్థిక సంస్థలు లక్ష్యంగా..

వ్యక్తుల ఖాతాల్లోని డబ్బు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలనూ లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాటి నెట్‌వర్క్‌లోకి చొరబడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. గత ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని ఏపీ మహేష్‌ అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌ సర్వర్‌లోకి చొరబడిన నేరగాళ్లు రూ.12 కోట్ల మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించారు. ఈ ఖాతాలన్నీ అమాయకులవే కావడం గమనార్హం. అంతకుముందు తెలంగాణ స్టేట్‌ కోపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ నుంచి రూ.1.98 కోట్లు కొల్లగొట్టారు. వీటితోపాటు ఇంకొన్ని ప్రైవేటు బ్యాంకులను కూడా దోచుకున్నారు. ఇప్పుడు ఈతరహా కేసులు పెరుగుతుండగా.. చాలా సంస్థలు పరువు పోతుందన్న ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం లేదని తెలుస్తోంది.


సాంకేతిక నిపుణులకు ఎర!

ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే సాంకేతిక పరిజ్ఞానం మీద మంచి పట్టుండాలి. దీంతో ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా నిపుణులను నియమించుకుంటున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. రాజస్థాన్‌లోని ఓ ముఠా ఇదేరీతిలో తెలుగు రాష్ట్రాల్లో హ్యాకింగ్‌లో అనుభవం ఉన్నవారిని నియమించుకుంటోంది. తమవద్ద పనిచేయడానికి నిపుణులు కావాలంటూ నేరగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా ప్రకటనలు ఇస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో తమ డిమాండ్లకు లొంగేవారికి ప్రతిఫలం ముట్టచెబుతున్నారు. వీరిద్వారా బ్యాంకులు, ఆర్థికసంస్థల సర్వర్లలోకి చొరబడుతున్నారు. ఈ నిపుణుల పని అంతవరకే. అనంతరం డబ్బును నేరగాళ్లు మ్యూల్‌ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. పని పూర్తయిన తర్వాత నిపుణులకు ప్రతిఫలం చెల్లిస్తున్నారు. సైబర్‌ ముఠాల నేరగాళ్లకు, ఈ నిపుణులకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. నకిలీ చిరునామాలతో ఉన్న ఫోన్‌ నంబర్ల ద్వారానే సంప్రదింపులు జరుపుతుంటారు. ఇటీవల ఓ ప్రైవేటు ఆర్థికసంస్థను మోసం చేసిన కేసులో విజయవాడకు చెందిన వ్యక్తి హస్తం ఉన్నట్లు బయటపడిందని, అతన్ని విచారించినప్పుడు రాజస్థాన్‌ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడొకరు వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన రెండు బ్యాంకుల దోపిడీల్లోనూ ఇలాంటి వారినే వాడారని వివరించారు. ‘ఐపీ’ల ద్వారా దర్యాప్తు జరిపితే సాంకేతిక సాయం అందించిన వారు.. మ్యూల్‌ ఖాతాల ద్వారా విచారణ చేపడితే అమాయకుల ఆచూకీ మాత్రమే లభిస్తుంది తప్ప అసలు నేరగాళ్లు దొరకడం లేదని ఆయన వెల్లడించారు. దీంతో సైబర్‌ నేరాల దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారిందని ఆయన తెలిపారు.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని