Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ

పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు నదిలో దూకాడు. 24గంటలు దాటినా అతని ఆచూకీ తెలియకపోవడంతో గల్లంతయ్యాడా.. లేక పారిపోయాడా తెలియక పోలీసులు హైరానా పడుతున్నారు.

Updated : 03 Feb 2023 06:55 IST

సంగం, న్యూస్‌టుడే: పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు నదిలో దూకాడు. 24గంటలు దాటినా అతని ఆచూకీ తెలియకపోవడంతో గల్లంతయ్యాడా.. లేక పారిపోయాడా తెలియక పోలీసులు హైరానా పడుతున్నారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో జరిగింది. ఒంటరి మహిళల బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారని నెల్లూరు గ్రామీణ మండలంలోని ఉప్పుటూరుకు చెందిన ఎ.గిరి, మరొకరిని ఆదివారం సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వీరిని బుధవారం రాత్రి ఏఎస్‌ పేటకు తీసుకెళ్లారు. తిరిగి నెల్లూరు వస్తుండగా నిందితుడు గిరి పారిపోయేందుకు పథకం వేశాడు. తనతో కలసి నేరాలకు పాల్పడే మరో వ్యక్తి, సంగంలోని కొండ ప్రాంతంలో ఉంటాడని పోలీసులను నమ్మించాడు. అతన్నీ పట్టుకోవచ్చని వాహనాన్ని అటు మళ్లించారు. వాహనం ఆత్మకూరు వెళ్లే మార్గంలో బీరాపేరు వాగు పెన్నా నదిలో కలిసే ప్రాంతానికి వెళ్లగానే పోలీసులను మాటల్లో పెట్టి వాహనం నెమ్మదిగా వెళ్లేలా చేశాడు. ఈ క్రమంలో తోటి నిందితుడితో కలిసి వేసిన సంకెళ్లను తొలగించుకొని వాహనంలోంచి కిందికి దూకాడు. పోలీసులు తేరుకునే సరికి పక్కనే ఉన్న బీరాపేరు వాగులోకి వెళ్లాడు. పోలీసులు వెంటపడే సరికి వాగులో లోతుకు వెళ్లి కనిపించలేదు. స్థానికుల సాయంతో గాలించినా జాడ దొరకలేదు. గురువారం గజ ఈతగాళ్లతోనూ వెదికించారు. పరారయ్యాడా లేక నదిలో గల్లంతయ్యాడా అనేది పోలీసులకు అంతుపట్టడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని