బాసలు మరచి.. నిలువునా నరికి..

మద్యం మత్తు విచక్షణను చంపేసింది.. భార్యపై అనుమానం రాక్షసుణ్ని చేసింది.. ఆమెపై కక్షతో పిల్లలను వేధించి జైలుపాలయ్యాడు. చివరకు జాలిపడి విడిపించిన భార్యను పాశవికంగా హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 29 Apr 2023 05:28 IST

భార్యపై అనుమానంతో రాక్షసుడైన భర్త  
గతంలో పిల్లలకు క్రూరంగా చిత్రహింసలు  
జైలు పాలైనా విడిపించిన ఆలిపై కత్తివేటు
చివరకు ఆత్మహత్యకు పాల్పడిన దుర్మార్గుడు

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: మద్యం మత్తు విచక్షణను చంపేసింది.. భార్యపై అనుమానం రాక్షసుణ్ని చేసింది.. ఆమెపై కక్షతో పిల్లలను వేధించి జైలుపాలయ్యాడు. చివరకు జాలిపడి విడిపించిన భార్యను పాశవికంగా హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు(35)కు, నిర్మల(30)తో పెళ్లయింది. వీరికి ఒక కుమారుడు (12), ఇద్దరు కుమార్తెలు (11, 9 ఏళ్లు) ఉన్నారు. మద్యానికి బానిసైన అతడు పనికి వెళ్లేవాడు కాదు. పైగా డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. పైగా ఆమెపై అనుమానం పెంచుకుని నిత్యం నరకం చూపేవాడు. ఆ బాధలు భరించలేక, ఇక్కడి సంపాదన సరిపోక కొన్నాళ్ల కిందట పిల్లలను భర్త వద్ద వదిలి నిర్మల మస్కట్‌ వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి డబ్బులు పంపుతూ ఉండేవారు. జల్సాలకు అలవాటు పడిన దావీదు మరింత సొమ్ము కోసం వేధించేవాడు.

పిల్లలను కొడుతూ వీడియో చిత్రీకరణ  

ఇద్దరు కుమార్తెలను కొడుతూ, కత్తితో బెదిరిస్తూ.. ఆ దృశ్యాలను కుమారుడితో వీడియో తీయించి భార్యకు పంపేవాడు. ఇవి బయటకు రావడంతో పెంటపాడు పోలీసులు గత ఏడాది సెప్టెంబరులో ఇతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో బంధువులు పిల్లలను హాస్టల్‌లో చేర్పించారు. దీనికి బాధపడిన నిర్మల మూడు నెలల కిందట వీరంపాలెం వచ్చేశారు. అతనిలో మార్పు వస్తుందని పెద్దలు నచ్చజెప్పడంతో జైలులో ఉన్న దావీదును బెయిల్‌పై విడిపించారు. అతడు మారకపోగా మద్యం మత్తులో నిత్యం భార్యతో ఘర్షణ పడేవాడు. నెల రోజుల కిందట ఆమె భర్తను వదిలి చిన్నాయగూడెంలోని చెల్లెలి ఇంటికి వెళ్లిపోయారు.

బతిమాలి.. ఒట్టేసి..: ఇంకెప్పుడూ గొడవ పడనని అతను ఒట్టేసి, బతిమిలాడి పది రోజుల కిందట ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. కుటుంబ సభ్యులు వారిస్తున్నా.. భర్త మారాడనుకుని నమ్మి ఇంటికి వచ్చిన ఆమెకు మళ్లీ మునుపటిలాగే నరకాన్నే చూపించాడు. శుక్రవారం తెల్లవారుజామున వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దావీదు ఆమెపై కత్తితో దాడి చేశాడు. మెడ, తల, ఇతర శరీర భాగాలపై ఇష్టానుసారం పొడిచాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. చేతులు సైతం నరికి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. తర్వాత ఇంట్లో ఉన్న గడ్డి మందు తీసుకుని పొలాల్లోకి వెళ్లి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని