YSRCP Activists: నగ్నంగా కూర్చోబెట్టి.. కటింగ్‌ప్లేయర్‌తో నొక్కి పట్టి

కోళ్లు దొంగిలించారన్న అనుమానంతో ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ముగ్గురు వ్యక్తులను స్థానిక వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Updated : 29 Jul 2023 13:57 IST

కోళ్లు దొంగిలించారంటూ ముగ్గురిపై వైకాపా కార్యకర్తల దాష్టీకం
పైపులు, కర్రలతో దాడి చేసి చిత్రహింసలు
బాధితుల్లో దళిత బాలుడు
ఏలూరు జిల్లాలో దారుణం

ఈనాడు- ఏలూరు, న్యూస్‌టుడే- ద్వారకాతిరుమల: కోళ్లు దొంగిలించారన్న అనుమానంతో ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ముగ్గురు వ్యక్తులను స్థానిక వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పిన సురేష్‌, అరటికట్ల రాంబాబుతోపాటు ఓ దళిత బాలుడిని ఈ నెల 25వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన అప్పసాని ధర్మారావు, కొనకళ్ల అప్పారావు, ఆచంట రాకేష్‌, ఘంటా శేఖర్‌, తోకల సిద్ధిరాజు, మురుగుల దుర్గారావులు పని ఉందని చెప్పి నాటుకోళ్లు పెంచే తోటలోకి తీసుకెళ్లారు. మా కోళ్లను దొంగిలించింది మీరేనా అని గద్దిస్తూ, దుస్తులు విప్పించి నగ్నంగా కూర్చోబెట్టారు. చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే కర్రలు, ప్లాస్టిక్‌ పైపులతో కొట్టి, చిత్రహింసలు పెట్టారు. వీపుపై వాతలు తేలిన దెబ్బలతో బాధితులున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. బాధితుల్లో ఒకరైన దళిత బాలుణ్ని ‘మా కోళ్లనే దొంగతనం చేస్తావా.. ఈ రోజు మా చేతుల్లో చచ్చిపోతావ్‌’ అంటూ కులం పేరుతో దూషించారు. అందరూ చూస్తుండగానే దుస్తులు తీయించి కటింగ్‌ప్లేయర్‌తో మర్మాంగాలను నొక్కిపట్టి.. చేతిపై చర్మాన్ని కత్తిరించారు. ఈ విషయంపై ముప్పిన సురేష్‌, అరటికట్ల రాంబాబు గురువారమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్ని పోలీసులు ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి.. కొట్టడం వల్లే గాయాలయ్యాయని నిర్ధారించడంతో నిందితులైన ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్‌ తెలిపారు.  ముగ్గురిని అర్ధనగ్నంగా నిలబెట్టి కర్రలతో దాడి చేశారని, బాలుడి మర్మాంగాలపై దాడి చేసిన ఆనవాళ్లు లేవని ఆయన చెప్పారు.

రాజీకి వైకాపా నేతల ప్రయత్నం

నిందితులు తమ పార్టీ కార్యకర్తలు కావటంతో స్థానిక వైకాపా నాయకులు వారిని తప్పించేందుకు బాధితులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు శుక్రవారం ప్రయత్నాలు చేశారు. ఓ ప్రజాప్రతినిధి ద్వారా కూడా సెల్‌ఫోన్‌లో చెప్పించేందుకు ప్రయత్నించారు. బాధితులు ఒప్పుకోకపోవటంతో కేసు నమోదైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని