Minister Venu: ఏపీ మంత్రి చెల్లుబోయిన పేరు చెప్పి.. దందా

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వరసకు సోదరుడినవుతానంటూ దందాలకు పాల్పడుతున్న వ్యక్తిని కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 27 Aug 2023 07:31 IST

పశువుల వ్యాపారికి బెదిరింపులు, రౌడీషీటర్‌ అరెస్టు
తొలుత గంజాయి కేసులో అదుపులోకి?

హనుమాన్‌ జంక్షన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వరసకు సోదరుడినవుతానంటూ దందాలకు పాల్పడుతున్న వ్యక్తిని కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో సీఐ ఏఎన్‌ నరసింహమూర్తి, ఎస్సై ఏడీఎల్‌ జనార్దన్‌ నిందితుడి వివరాలు వెల్లడించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన దొంగల శ్రీధర్‌ మంత్రి చెల్లుబోయిన స్టిక్కరు ఉన్న వాహనంలో తిరుగుతున్నాడు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన తొందూరు శ్యామ్యూల్‌ అనే పశువుల వ్యాపారిని ఇటీవల కలిశాడు. మంత్రి పేరు చెప్పుకుని రామచంద్రాపురంలోనూ పశువుల వ్యాపారం చేద్దామంటూ కొంతకాలం కిందట శ్యామ్యూల్‌ వద్ద రూ.10 వేల నగదు తీసుకున్నాడు. తర్వాత కూడా పదేపదే డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఈ నెల 25న శ్యామ్యూల్‌ నూజివీడు వెళ్తుండగా, శ్రీధర్‌ అడ్డగించి బెదిరింపులకు దిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీధర్‌ను అరెస్టు చేసి, నూజివీడు కోర్టులో హాజరు పర్చామని పోలీసులు చెప్పారు. శ్రీధర్‌పై కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉందని, ప్రత్తిపాడు, ద్రాక్షారామం, గొల్లపాలెం, రాజానగరం, అన్నవరం, ఆలమూరు స్టేషన్లలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు.

అంతా అనుమానాస్పదమే

దొంగల శ్రీధర్‌ అరెస్టు వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు ఈ నెల 24న రాత్రి శ్రీధర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉన్నత స్థాయిలో వచ్చిన ఆదేశాలతో తమ పరిధి కానప్పటికీ, ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు పశువుల సంతకు వెళ్లి మరీ అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ రోజే ఉంగుటూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా, గంజాయి రవాణా కేసులో అరెస్టు చేయనున్నట్లు ప్రచారం జరిగింది. పోలీసులు ఆ వివరాలేవీ వెల్లడించలేదు. నిందితుడి ఫొటోలు కూడా మీడియాకు విడుదల చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు