AP Grama Volunteer: వివాహిత చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లిన వాలంటీరు

ఇంటి అరుగుపై కూర్చున్న వివాహితను ఓ వాలంటీరు చేయిపట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లబోయాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు గుమిగూడారు.

Updated : 04 Sep 2023 07:43 IST

ప్రతిఘటించడంతో మహిళపై దాడి
తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నారని బెదిరింపు

చెరుకుపల్లి గ్రామీణ (ఆళ్లవారిపాలెం), న్యూస్‌టుడే: ఇంటి అరుగుపై కూర్చున్న వివాహితను ఓ వాలంటీరు చేయిపట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లబోయాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు గుమిగూడారు. దీంతో బయటకు వెళ్లిపోయిన వాలంటీరు కర్రలతో తన అనుచరులను వెంటేసుకుని వచ్చి భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనపై బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని బాప్టిస్టుపాలేనికి చెందిన ఓ వివాహిత ఆదివారం ఇంటిముందు అరుగుపై కూర్చున్నారు. ఆ సమయంలో వాలంటీరు గాలిమోటు లోకకుమార్‌ ఆమె వద్దకు వచ్చి ‘నువ్వంటే నాకు ఇష్టం’ అంటూ ఆమె చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు.

ఆమె వెంటనే తేరుకుని, చేయి విడిపించుకుంటూ కేకలు వేశారు. ఎందుకు అరుస్తున్నావంటూ అతడు కాలితో తన్నడంతో ఆమె పడిపోయారు. చుట్టుపక్కల వారు రావడంతో ‘నీ అంతు చూస్తా.. నన్ను ఎవ్వడూ ఏం చేయలేరు’ అంటూ అతడు వెళ్లిపోయాడు. కాసేపటికి తన బంధువులు, అనుచరులతో కర్రలు తీసుకుని వచ్చాడు. వారి దాడి నుంచి తప్పించుకుని, బాధితురాలిని ఆమె బంధువులు ఆటోలో తీసుకుని చెరుకుపల్లి వచ్చారు. నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా ఇలాగే ఈ వాలంటీరే తనతో అమానుషంగా ప్రవర్తించాడని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. వాలంటీరే దౌర్జన్యం చేసి, తిరిగి వారిపైనే కేసులు పెడతాడని, అదేమంటే తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నారంటూ బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు.

వాలంటీరు, అతని అనుచరులు, బంధువులతో తనకు, తన బంధువులకు ప్రాణహాని ఉందని తెలిపారు. వాలంటీరు లోకకుమార్‌ గ్రామంలో తనలాంటి వారి నుంచి వడ్డీకి డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకపోగా, దిక్కున్నచోట చెప్పుకోవాలని దౌర్జన్యం చేస్తున్నాడని వార్డు సభ్యురాలు మరియమ్మ వాపోయారు. తాము వైకాపా వారిమేనని, వాలంటీరు అరాచకాలకు తట్టుకోలేకపోతున్నామని కొందరు మహిళలు పోలీసుల వద్ద విలపించారు. పింఛను ఇచ్చే నెపంతో వాలంటీరు ఇళ్లకు వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అందుకే అతడిని తాము ఇళ్లకు రానీయడం లేదని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని