జాతీయ రహదారిపై గంజాయి కంటైనర్‌ ఛేజింగ్‌

గంజాయి రవాణా చేస్తున్న ఓ కంటైనర్‌ లారీ రెండు జిల్లాల పోలీసులను పరుగులు పెట్టించింది. ఆఖరికి ఛేజ్‌ చేసి ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Updated : 04 Mar 2024 07:54 IST

శ్రీకాకుళంలో తప్పించుకుని ముందుకు
ముగ్గురు సిబ్బందికి గాయాలు
విశాఖలో పట్టుకున్న పోలీసులు

కాశీబుగ్గ, విశాఖపట్నం (ఆనందపురం) - న్యూస్‌టుడే: గంజాయి రవాణా చేస్తున్న ఓ కంటైనర్‌ లారీ రెండు జిల్లాల పోలీసులను పరుగులు పెట్టించింది. ఆఖరికి ఛేజ్‌ చేసి ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. చెన్నై నుంచి వచ్చిన కంటైనర్‌.. ఒడిశాలోని గారబంద ప్రాంతంలో గంజాయి లోడింగ్‌ చేసుకుని వస్తున్నట్లు శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పలాస సమీపంలోని నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై ఎస్‌ఐ ప్రభాకరరావు, కానిస్టేబుళ్లు సంతోష్‌, సురేష్‌లు నిఘా పెట్టారు. ఆదివారం వేకువజామున సంబంధిత కంటైనర్‌ రావడంతో ఆపారు. లోపల తనిఖీ చేయాలని వాహనాన్ని పక్కన నిలపాలని డ్రైవర్‌కు చెప్పారు. అతడు తప్పించుకోవడానికి ఒక్కసారిగా కంటైనర్‌ను ముందుకు ఉరికించి మలుపు తిప్పడంతో పక్కనే ఉన్న సిబ్బంది తుళ్లిపోయి పడిపోయారు.

దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని శ్రీకాకుళం తరలించారు. కంటైనర్‌ తప్పించుకున్న ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్‌ రోడ్డు వద్ద వాహనం కోసం మాటు వేశారు. అక్కడా ఈ కంటైనర్‌ ఆగకుండా ముందుకు దూసుకుపోయింది. పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని వదిలేసి డ్రైవర్‌, సహాయకుడు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న కంటైనర్‌ను ఆనందపురం పోలీసుస్టేషన్‌కు తరలించి పరిశీలించగా పొక్లెయిన్‌ విడి భాగాలతో పాటు 13 గోనె సంచుల్లో 386 కిలోల మేర 80 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. ఈ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియాల్సి ఉందని విశాఖ డీసీపీ-1 విజయ మణికంఠ పేర్కొన్నారు. పరారైన డ్రైవర్‌, సహాయకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని పంపినట్లు ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని