చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి

తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్‌లో ఉండేవాడు.

Published : 03 May 2024 04:11 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్‌లో ఉండేవాడు. అతడు కూలీ కాగా, భార్య ఇళ్లల్లో పని చేస్తుంటుంది. ఇటీవల వారు హఫీజ్‌పేటకు మకాం మార్చారు. అయినా, బాబు అంజయ్యనగర్‌కు తరచూ వెళ్లి స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండేవాడు. బుధవారం రాత్రి హరి అనే మిత్రుడితో కలిసి మద్యం తాగి ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. గురువారం ఉదయం మళ్లీ ఇద్దరూ తాగి అంజయ్యనగర్‌లోని చెత్త కుప్పల సమీపంలో రోడ్డు పక్కన పడుకున్నారు. ఈ క్రమంలో చెత్తకుప్పలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. హరి మంటల సెగకు నిద్ర లేచి బాబును గమనించకుండానే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. బాబు తప్పించుకునే క్రమంలో జారి మంటల్లో చిక్కుకుపోయాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేలోపే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాబుకు శ్రీకర్‌(11), నిహాల్‌(7) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని