గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్‌

గుంటూరులోని నెహ్రూనగర్‌ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు.

Published : 03 May 2024 06:42 IST

వృద్ధురాలిని బైక్‌తో ఢీకొట్టి.. అడ్డొచ్చిన వారిపై దాడి

గుంటూరు(నెహ్రూనగర్‌), న్యూస్‌టుడే : గుంటూరులోని నెహ్రూనగర్‌ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. శ్రీను అనే యువకుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఏమి జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. నెహ్రూనగర్‌ ఆరో వీధిలో సలోమి అనే వృద్ధురాలిని ఢీ కొట్టారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఇది చూసిన స్థానికులు పడిపోయిన వృద్ధురాలిని లేపి, వాళ్లను ప్రశ్నించడంతో ఒక్కసారిగా రెచ్చిపోయారు. దాడికి తెగబడ్డారు. ఫోన్‌ చేసి మరికొందరినీ పిలిపించుకున్నారు. వారంతా కలిసి నెహ్రూనగర్‌ ఆరో వీధి నుంచి ఒకటో వీధి వరకూ అడ్డొచ్చిన వారిపై దాడి చేసుకుంటూ వెళ్లారు. ఆ పక్కనే ఉన్న బుచ్చయ్యతోట ఐదో వీధిలో ఓ వ్యక్తిని కొట్టసాగారు. విషయం తెలుసుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలికి వచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గొడవ జరిగిందని, గంజాయి బ్యాచ్‌ కాదని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీఐ అన్వర్‌బాషా తెలిపారు. ‘‘15 మంది వచ్చి.. మా ఇంటి ఎదురుగా ఉన్నవాళ్లను కొట్టారు. వారంతా గంజాయి మత్తులో ఉన్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు నన్నూ తీవ్రంగా కొట్టారు’’ అని స్థానికుడు అశోక్‌ తెలిపారు.

పింఛను కోసం వెళ్లి వస్తుంటే..: సలోమి, గాయపడిన వృద్ధురాలు: బ్యాంకు ఖాతాలో పింఛను డబ్బులు పడ్డాయో లేదోనని తెలుసుకునేందుకు నెట్‌ సెంటర్‌కు వెళ్లి వస్తుంటే యువకులు వాహనంపై వచ్చి ఢీకొట్టారు. తలకు గాయం కావడంతో సొమ్మసిల్లి పడిపోయాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని