మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు

అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్‌ అలియాస్‌ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 03 May 2024 06:54 IST

తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు
భాను అప్పీలు కొట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్‌ అలియాస్‌ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దెలచెర్వు సూరి 2011 జనవరిలో హత్యకు గురయ్యారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018 డిసెంబరులో కింది కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ భాను హైకోర్టులో అప్పీలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం విచారణ చేపటింది. భాను తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవన్నారు. ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగానే కింది కోర్టు జైలు శిక్ష విధించిందన్నారు.

సాక్ష్యం ఇచ్చిన ఇద్దరూ అనుమానితులేనన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పిటిషనర్‌ రివాల్వర్‌, పిస్టల్‌ వినియోగించినట్లు కూడా నిరూపించలేదని తెలిపారు. కేవలం పరారీ అన్న విషయాన్నే పరిగణనలోకి తీసుకుందని, దీనికి సంబంధించి సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు. సాక్షులు కూడా పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇచ్చారన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు ఈ వాదనలను వ్యతిరేకిస్తూ.. భాను పథకం ప్రకారం సూరిని హత్య చేశారన్నారు. హత్య జరిగిన రోజున సూరితోపాటు భాను కారులో ప్రయాణిస్తున్నారన్నారు. సూరిని వెనుక నుంచి భాను కాల్చి చంపారని వివరించారు. హత్య తరువాత మధ్యప్రదేశ్‌ పారిపోయారని కోర్టుకు తెలిపారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం భాను అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని