ప్రేమ ప్రయాణం విషాదాంతం

వారిద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి నడవాలనుకున్నారు. ముహూర్తం నిశ్చయమైంది. వివాహ సామగ్రితో బస్సులో యువతి, ద్విచక్రవాహనంపై యువకుడు బయల్దేరారు.

Updated : 23 Mar 2024 07:51 IST

వివాహ సామగ్రితో బస్సులో యువతి, ద్విచక్రవాహనంపై యువకుడి పయనం
కారు ఢీకొని యువకుడికి తీవ్రగాయాలు.. గమనించి ఆసుపత్రికి తరలించిన ప్రేయసి
చికిత్స పొందుతూ మృతి

కందుకూరు, న్యూస్‌టుడే: వారిద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి నడవాలనుకున్నారు. ముహూర్తం నిశ్చయమైంది. వివాహ సామగ్రితో బస్సులో యువతి, ద్విచక్రవాహనంపై యువకుడు బయల్దేరారు. ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న వారి ఆశలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. వెనుకే బస్సులో వచ్చిన యువతి అతడిని గమనించి ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దెబ్బడగూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామానికి చెందిన తూంకుంట శంకర్‌(27).. హైదరాబాద్‌కు ఉపాధి కోసం వచ్చి సంతోష్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఓ న్యూస్‌ ఛానల్‌లో పనిచేస్తున్నాడు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యువతిని ప్రేమించాడు. వీరి పెళ్లికి శంకర్‌ తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు. యువతి బంధువులు అంగీకరించకపోయినా.. శంకర్‌ ఈ నెల 20న పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రేయసితో కలిసి నగరంలో వివాహానికి అవసరమైన అన్ని వస్తువులు కొనుగోలు చేశాడు. వాటితో ఈ నెల 19న నగరం నుంచి ఇద్దరూ శంకర్‌ స్వగ్రామానికి బయలుదేరారు. సామగ్రి ఉండడంతో ఓ బంధువుతోపాటు యువతిని బస్సు ఎక్కించి.. శంకర్‌ ద్విచక్ర వాహనంపై పయనమయ్యాడు. హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిపై దెబ్బడగూడ గేటు వద్ద అతడి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన 15-20 నిమిషాల తర్వాత అదే దారిలో బస్సులో వస్తున్న శంకర్‌ ప్రేయసి.. ద్విచక్ర వాహనం నంబరు గుర్తించి పరుగు తీసింది. 108 వాహనానికి కాల్‌ చేసింది. తీవ్రగాయాలైన అతడిని 108లో నగరంలోని ఆసుపత్రికి తరలించింది. తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిన యువకుడు.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని