శిశువే సాక్ష్యమయ్యాడు

14 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన నిందితుడు రాచర్ల వంశీకృష్ణకు ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి పంచాక్షరి బుధవారం తీర్పునిచ్చారు. గత ఏడాది సెప్టెంబరులో

Published : 02 Dec 2021 05:34 IST

బాలికను గర్భవతిని చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

నిజామాబాద్‌ న్యాయవిభాగం, నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: 14 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన నిందితుడు రాచర్ల వంశీకృష్ణకు ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి పంచాక్షరి బుధవారం తీర్పునిచ్చారు. గత ఏడాది సెప్టెంబరులో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన రాచర్ల వంశీకృష్ణ భయపెట్టి లొంగదీసుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక తల్లి ఇందుకు బాధ్యుడైన వంశీకృష్ణను నిలదీయగా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. బాలిక ప్రసవం తర్వాత మాట మార్చడంతో బాధిత కుటుంబం ఆర్మూర్‌ పోలీసులను ఆశ్రయించింది. వారి దర్యాప్తులో నిందితుడి వల్ల బాధితురాలికి పుట్టిన మగ బిడ్డ ప్రధాన సాక్ష్యంగా మారాడు. నిందితుడు, పుట్టిన బిడ్డలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా నివేదికల్లో ఇద్దరి డీఎన్‌ఏ ఒకటేనని తేలింది. దీన్ని కోర్టులో సమర్పించి పి.పి. రవిరాజ్‌ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. బాధిత బాలిక కుటుంబం న్యాయసేవా సంస్థను సంప్రదించి నష్ట పరిహార చట్టం కింద రూ.లక్ష పొందాలని తీర్పునిచ్చారు. జిల్లాలో పోక్సో చట్టం ప్రకారం ఇన్ని సంవత్సరాల శిక్ష విధించడం ఇదే మొదటిసారి. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అప్పటి విచారణ అధికారి సీఐ రాఘవేందర్‌, ఆర్మూర్‌ ఏసీపీ రఘు, కోర్టు కానిస్టేబుల్‌ శంకర్‌, లైజన్‌ అధికారి శ్యాంను సీపీ కార్తికేయ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని