రుణం మంజూరు కాలేదని ఆత్మహత్యాయత్నం

స్వయం ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్‌కు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రుణం ఇవ్వడం లేదని.. కనీసం ఇంటి నిర్మాణానికైనా రుణం ఇప్పించాలని కోరుతూ ఓ వ్యక్తి సిద్దిపేట జిల్లా

Published : 08 Dec 2021 04:59 IST

జగదేవపూర్‌ తహసీల్దార్‌ ఎదుట ఘటన

జగదేవపూర్‌, న్యూస్‌టుడే: స్వయం ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్‌కు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రుణం ఇవ్వడం లేదని.. కనీసం ఇంటి నిర్మాణానికైనా రుణం ఇప్పించాలని కోరుతూ ఓ వ్యక్తి సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్సై పరమేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం జగదేవపూర్‌ మండలం తీగుల్‌ గ్రామానికి చెందిన ఎల్లం బాలకృష్ణ(42) వ్యవసాయంతో పాటు తాపీపని చేస్తున్నారు. సమీపంలో కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ మట్టి పోయడంతో తనకున్న ఎకరం భూమిలో నీరు నిలిచి పంట పండడం లేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో జీవనాధారం కోల్పోయానని అధికారులను బాలకృష్ణ ఆశ్రయించారు. ఎస్సీ కార్పొరేషన్‌ కింద ఉపాధికి రుణం ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో దరఖాస్తు చేసుకున్నారు. రుణం మంజూరు కాకపోవడంతో తన ఇంటి నిర్మాణానికైనా సహకరించాలని మంగళవారం తహసీల్దార్‌ యాదగిరిరెడ్డిని కలిసి బాలకృష్ణ విజ్ఞాపన పత్రం ఇచ్చారు. పరిశీలించిన తహసీల్దార్‌ ఎస్సీ కార్పొరేషన్‌ రుణానికి ఎంపీడీఓను, ఇంటి రుణానికి బ్యాంకును సంప్రదించాలని చెప్పారు. మనస్తాపానికి గురైన బాలకృష్ణ వెంట తెచ్చుకున్న పురుగు మందును తాగబోయారు. అప్రమత్తమైన తహసీల్దార్‌, ఇతర సిబ్బంది పురుగు మందు సీసాను లాక్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని