Crime News: యాప్‌లో పెట్టుబడి.. రూ.కోట్లకు బురిడీ

‘మీరు కేవలం రూ.800తో స్టెతస్కోపు కొనండి. దాన్ని మేమే కావాల్సిన వారికి అద్దెకు ఇస్తాం. రోజుకు రూ.42 చొప్పున రెండు నెలలు మీకు అద్దె చెల్లిస్తాం.’ ‘రూ.5వేలతో ఆక్సిజన్‌ సిలిండర్‌ కొనండి. దానికి రోజుకు రూ.249 చొప్పున 2 నెలలపాటు అద్దె చెల్లిస్తాం.’

Updated : 26 Dec 2021 06:45 IST

 ఆరోగ్య ఉత్పత్తుల అద్దె పేరుతో భారీ మోసం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ‘మీరు కేవలం రూ.800తో స్టెతస్కోపు కొనండి. దాన్ని మేమే కావాల్సిన వారికి అద్దెకు ఇస్తాం. రోజుకు రూ.42 చొప్పున రెండు నెలలు మీకు అద్దె చెల్లిస్తాం.’ ‘రూ.5వేలతో ఆక్సిజన్‌ సిలిండర్‌ కొనండి. దానికి రోజుకు రూ.249 చొప్పున 2 నెలలపాటు అద్దె చెల్లిస్తాం.’

‘లవ్‌ లైఫ్‌ అండ్‌ నేచురల్‌ హెల్త్‌కేర్‌’ పేరుతో వచ్చిన ఈ ప్రకటన ఎంతోమందిని ఆకర్షించింది. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి, వేలల్లో పెట్టుబడులు పెట్టారు. 20 రోజుల్లో పెట్టిన మొత్తం వచ్చేయడంతో ఆశపడ్డారు. అప్పులు చేసి రూ.లక్షలు కట్టారు. అంతే.. 2 రోజుల తర్వాత అద్దెలు రావడం ఆగింది. యాప్‌ పని చేయకపోవటంతో బాధితులంతా లబోదిబోమన్నారు. ఇలా మోసపోయినవాళ్లు విజయవాడలోనే 600 మంది వరకు ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉంటారని సమాచారం.

యాప్‌ పేరుతో మోసం

తొలుత ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ నేచురల్‌ హెల్త్‌కేర్‌’ పేరుతో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు చెప్పారు. అప్పటికే దానిలో రూ.800 నుంచి రూ.2.98 లక్షల విలువైన పలు ఉత్పత్తులను ఉంచారు. వాటిలో స్టెతస్కోప్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌, ఆక్సిజన్‌ సిలిండర్‌, వెంటిలేటర్‌, అంబులెన్స్‌ వంటి వాటిని కొంటే, సదరు సంస్థే కావాల్సిన ఆసుపత్రులకు అద్దెకు ఇస్తామని చెప్పింది. వస్తువు కొన్నవారికి రోజూ అద్దె చెల్లిస్తారు. మొదట్లో చాలామంది చిన్న ఉత్పత్తులు కొనుగోలు చేశారు. 20 రోజుల్లోనే పెట్టుబడి వచ్చేయడంతో ఆకర్షితులయ్యారు. నగరానికి చెందిన ఒక చిరు వ్యాపారి ఈ నెల 3న రూ.6,700 పెట్టారు. అది వచ్చేయడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ నెల 20, 21 తేదీల్లో రూ.15లక్షల వరకు పెట్టారు. కొన్ని రోజులుగా అద్దె రాకపోవటంతో ఆరాతీశారు. 19 నుంచే డబ్బులు రావట్లేదని, యాప్‌ పనిచేయట్లేదని తెలిసి మోసపోయినట్లు గ్రహించారు. ఇందులోనే వీఐపీ యాప్‌ అని మరొకటి సృష్టించారు. అందులో రూ.14,980 పెడితే 2 గంటల్లోనే అద్దె డబ్బులు వచ్చేస్తాయనడంతో ఈ నెల 23న దానిలోనే కొంతమంది పెట్టుబడి పెట్టారు. తర్వాత నుంచి అదీ పనిచేయకపోవటంతో లబోదిబోమన్నారు. మోసం మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. కొంతమంది విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని