Crime News: కదల్లేని అమ్మ ఎదుట.. కన్నబిడ్డల రక్తపాతం

పక్షవాతంతో ఓ తల్లి మంచానికే పరిమితమైంది. ఇద్దరు కుమారులు తాగిన మైకంలో ఆమె కళ్లెదుటే ఘర్షణ పడ్డారు. నిస్సహాయ స్థితిలోని ఆమె వారిని వారించలేకపోయింది. ఈ

Updated : 27 Dec 2021 06:56 IST

తల్లి కళ్లముందే సోదరుల ఘర్షణ

అన్న మృతి.. పరారైన తమ్ముడు

దుండిగల్‌, న్యూస్‌టుడే: పక్షవాతంతో ఓ తల్లి మంచానికే పరిమితమైంది. ఇద్దరు కుమారులు తాగిన మైకంలో ఆమె కళ్లెదుటే ఘర్షణ పడ్డారు. నిస్సహాయ స్థితిలోని ఆమె వారిని వారించలేకపోయింది. ఈ కొట్లాటలో పెద్ద కుమారుడు మృతి చెందాడు. విషయం ఎవరికి చెప్పాలో తెలియక కొడుకు మృతదేహం పక్కనే జీవచ్ఛవంలా కొన్ని గంటల పాటు ఆమె మౌనంగా రోదించింది. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లో జరిగిన ఉదంతమిది. సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన వెంకట శ్రీమన్నారాయణ, వరలక్ష్మి దంపతులు. చాన్నాళ్ల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ వచ్చారు. వీరికి భరత్‌(35), సాయితేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో పనిచేసిన శ్రీమన్నారాయణ కొద్దికాలం క్రితం చనిపోయారు. వరలక్ష్మి పదేళ్లుగా పక్షవాతంతో మంచాన పడింది. ఇద్దరు కుమారులు జులాయిగా తిరుగుతూ మద్యం మత్తులో తరచూ గొడవ పడేవారు. శుక్రవారం రాత్రి అన్న భరత్‌తో ఘర్షణ పడిన తమ్ముడు.. వంటింట్లోని కుక్కర్‌ తీసుకుని బలంగా కొట్టడంతో అతడు కిందపడిపోయాడు. తర్వాత మత్తులో ఉన్న తమ్ముడు తల్లి మంచం పక్కనే నేల మీద పడుకుని అలాగే నిద్రపోయాడు. శనివారం ఉదయం చూసేసరికి అన్న చనిపోయి ఉండటంతో భయంతో ఇంట్లోంచి పారిపోయాడు. తర్వాత సాయంత్రం ఓ స్నేహితుడికి ఫోన్‌ చేసి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. తల్లి కదల్లేని పరిస్థితుల్లో ఉండడంతో భరత్‌కు అంత్యక్రియలు నిర్వహించేవారు లేక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి శవాగారానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని