Telangana News: నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం కూలిన ఘటన.. పైలెట్‌ 4నెలల గర్భిణి!

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తిలో శిక్షణ విమానం కూలి మహిళా పైలెట్‌ మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షులు, ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌ విజయపురి సౌత్‌లో ఉన్న ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ ప్రైవేటు అకాడమీకి చెందిన

Updated : 27 Feb 2022 07:59 IST

ఈనాడు, నల్గొండ, పెద్దవూర, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తిలో శిక్షణ విమానం కూలి మహిళా పైలెట్‌ మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షులు, ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌ విజయపురి సౌత్‌లో ఉన్న ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ ప్రైవేటు అకాడమీకి చెందిన ‘సెస్నా - 152’ రెండు సీట్ల శిక్షణ విమానం శనివారం ఉదయం 10.50 గంటలకు పెద్దవూర మండలం తుంగతుర్తి - రామన్నగూడెం తండా సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలెట్‌ మహిమా గజరాజ్‌ (29) మృతిచెందారు. శరీరం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. ఆమె నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. అకాడమీ నుంచి ఉదయం 10.25 గంటలకు బయలుదేరిన విమానం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరుకు వెళ్లాల్సి ఉంది. బయలుదేరిన పది నిమిషాలకే విమానం పట్టు తప్పి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. సుమారు పది నిమిషాల పాటు భూమి నుంచి తక్కువ ఎత్తులోనే ప్రయాణించిందని, పైలెట్‌ కిందకు దించేందుకు ప్రయత్నించి ఉండవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 132 కేవీ విద్యుత్‌ స్తంభం పక్కనే విమానం కుప్పకూలినా, కరెంటు తీగలకు తాకలేదని అధికారులు తెలిపారు. ప్రమాదంపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. పైలెట్‌ ఒక్కరినే పంపించడం శిక్షణలో భాగమేనని, ఆరు నెలలుగా మహిమ బాగా తర్ఫీదు పొందారని ఏవియేషన్‌ అకాడమీ సీఈవో మమత తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మహిమ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చెన్నైకి తరలించారు. సంఘటన స్థలంలో ఆమె భర్త పరంధామన్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు.


 


పెద్ద శబ్దంతో కుప్పకూలింది 

ఉదయం 10.50 గంటల ప్రాంతంలో విమానం భూమికి చాలా తక్కువ ఎత్తులో వెళ్తోంది. గాల్లోనే ఊగిసలాడింది. కాసేపటికి పెద్ద శబ్దం వచ్చింది. పరిగెత్తుకు వెళ్లి చూస్తే విమానం కూలిపోయి ఉంది. పక్కనే విద్యుత్తు స్తంభాలున్నా వాటికి తగలలేదు. మంటలు రాలేదు. వెంటనే మా తహసీల్దారుకు సమాచారం ఇచ్చా.

- అంజయ్య, తుంగతుర్తి వీఆర్‌ఏ, ప్రత్యక్ష సాక్షి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని