Road Accident: మితిమీరిన వేగం.. గుడిలోకి దూసుకెళ్లిన వాహనం

శ్రీరామ నవమి పర్వదిన వేళ.. సాయంత్రం భక్తులంతా భజనలో మునిగివున్న సమయాన.. ఆలయ ఆవరణలో చిన్నారులు ఆదమరిచి ఆడుకుంటుండగా ఓ వాహనం మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు

Updated : 11 Apr 2022 07:36 IST

పండగ వేళ.. ఇద్దరు చిన్నారుల మృత్యువాత

కొణిజర్ల, న్యూస్‌టుడే: శ్రీరామ నవమి పర్వదిన వేళ.. సాయంత్రం భక్తులంతా భజనలో మునిగివున్న సమయాన.. ఆలయ ఆవరణలో చిన్నారులు ఆదమరిచి ఆడుకుంటుండగా ఓ వాహనం మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులను చిదిమేసింది.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో ఆదివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలివి..

పల్లిపాడులోని ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం సీతారామ కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం భజన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. తుమ్మలపల్లికి చెందిన భజన బృందంతోపాటు స్థానికులు ఇందులో పాల్గొన్నారు. అదే సమయంలో ఖమ్మం నుంచి దుద్దెపూడి వెళ్తున్న బొలెరో వాహనం మితిమీరిన వేగంతో గుడి ముందున్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. ఆలయం ప్రహరీ పగలగొట్టుకుంటూ అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు పగడాల దేదీప్య(9), సహస్ర (7), మరో చిన్నారి అలేఖ్య, స్థానికులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనంలో ఉన్న రైతు నాగాటి వెంకన్న, డ్రైవర్‌ పోతురాజులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన దేదీప్య, సహస్ర, వెంకన్నతోపాటు మిగతావారిని 108 వాహనంలో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దేదీప్య, సహస్ర కన్నుమూశారు. పండగ పూట చిన్నారుల మృతితో తల్లిదండ్రులు పగడాల ఆదినారాయణ, శిరీషలు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాద సమయంలో వీరు ఆలయం లోపల పూజలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని