పులివెందులలో చంద్రబాబు బర్త్‌డే నిర్వహించారని కేసులు.. దంపతుల ఆత్మహత్యాయత్నం

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైకాపా నేతల అక్రమ కేసులతో మనస్తాపం చెందిన తెదేపాకు చెందిన దంపతులు గురువారం ఆత్మహత్యకు యత్నించారు. చక్రాయపేట మండలం చెరువుకాంపల్లెలో తెదేపా కార్యకర్తలు

Updated : 29 Apr 2022 09:16 IST

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, చక్రాయపేట: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైకాపా నేతల అక్రమ కేసులతో మనస్తాపం చెందిన తెదేపాకు చెందిన దంపతులు గురువారం ఆత్మహత్యకు యత్నించారు. చక్రాయపేట మండలం చెరువుకాంపల్లెలో తెదేపా కార్యకర్తలు రామాంజనేయులు, కృష్ణవేణి దంపతులు ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబునాయుడి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేక్‌ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. ఇది గిట్టని స్థానిక వైకాపా నేత సురేష్‌ తన భార్య పద్మజ పేరిట దంపతులపై అక్రమ కేసులు బనాయించినట్లు బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.

పోలీసుస్టేషన్‌కు రావాలంటూ సచివాలయం మహిళా కానిస్టేబుల్‌ ఒత్తిడి తేవడంతో మనస్తాపం చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిపై గతంలోనూ రెండు అక్రమ కేసులు పెట్టారని, తరచూ పోలీసులు ఇంటికి రావడాన్ని అవమానంగా భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని చెబుతున్నారు. బాధితులకు వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, తర్వాత కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. రామాంజనేయులు దంపతులు బలవన్మరణానికి యత్నించడం నేరమని పేర్కొన్నారు. వీరి చర్యలతో ఇటీవల పద్మజ ఆత్మహత్యాయత్నం చేశారని, ఆ ఘటనతో కేసు అవుతుందని భయపడి వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని వివరించారు. వారి కుటుంబ గొడవలు కూడా కారణం కావొచ్చని పేర్కొన్నారు.

పోలీసులపై ప్రైవేటు కేసు: ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ అవినాశ్‌రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి తెదేపా కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపించారు. ఈ ఘటనను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో వైకాపా ఆగడాలను అడ్డుకోవడానికి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని