Yadagirigutta: యాదగిరిగుట్టలో కుప్పకూలిన భవనం బాల్కనీ

శిథిలావస్థకు చేరిన ఓ రెండంతస్తుల భవనం ముందు భాగం (బాల్కనీ) కూలి నలుగురు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటు...

Published : 30 Apr 2022 05:24 IST

నలుగురి మృతి, ఒకరికి తీవ్రగాయాలు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట పట్టణం: శిథిలావస్థకు చేరిన ఓ రెండంతస్తుల భవనం ముందు భాగం (బాల్కనీ) కూలి నలుగురు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం రాయిగిరి - యాదగిరిగుట్ట పట్టణం ప్రధాన రహదారి పక్కన శ్రీరాంనగర్‌లో ఓ రెండంతస్తుల భవనాన్ని దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించారు. ఐదేళ్ల క్రితం ఆ భవనానికి ముందుభాగంలో స్లాబ్‌ వేసి విస్తరించారు. అందులో రెండు షట్టర్లను వేసి ఒకదాంట్లో వస్త్రదుకాణం, మరోదాంట్లో బ్యాటరీ రీఛార్జి దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. భవన యజమాని గుండ్లపల్లి దశరథ ఆ భవనంపైనే నివసిస్తున్నారు. స్లాబ్‌ వేసిన బాల్కనీ భాగం శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలడంతో పైన ఉన్న దశరథ (70)తో పాటు వస్త్ర దుకాణ నిర్వాహకుడు సుంచు శ్రీనివాస్‌ (38), అతడి స్నేహితులు తంగెళ్లపల్లి శ్రీనాథ్‌ (38), సుంకి ఉపేందర్‌ (39) మృతిచెందారు. దశరథ, శ్రీనాథ్‌, ఉపేందర్‌ అక్కడికక్కడే మృతిచెందగా...సుంచు శ్రీనివాస్‌ భువనగిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఈ ఘటనలో బ్యాటరీ దుకాణం నిర్వాహకుడైన గజవెల్లి గిరి (37) తీవ్రంగా గాయపడగా ఆయనను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనలో మృతిచెందిన వారిని శవపరీక్షల నిమిత్తం భువనగిరి కేంద్ర ఆసుపత్రికి తరలించారు. నలుగురు మృతులతో పాటు గాయపడిన వారు కూడా స్థానికులేనని గుట్ట ఎస్సై చంద్ర సుధాకర్‌రావు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జానకిరెడ్డి తెలిపారు.  

బాధితులంతా స్నేహితులే...

ఈ ఘటనలో మృతిచెందిన శ్రీనివాస్‌, శ్రీనాథ్‌, ఉపేందర్‌, గాయపడిన గిరి... నలుగురూ స్నేహితులు.  హైదరాబాద్‌లో ప్రైవేటు కొలువు చేస్తున్న శ్రీనాథ్‌ వారాంతం కావడంతో యాదగిరిగుట్టలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న సుంచు శ్రీనివాస్‌ వద్దకు శుక్రవారం వచ్చారు. తాను శ్రీను దుకాణం వద్దకు వచ్చానని, రావాలని కోరగా, అతడి స్నేహితులైన ఉపేందర్‌ కూడా అక్కడికి చేరుకున్నారు. మాట్లాడుకుంటుండగా ఈ దారుణం జరిగింది. అందరివీ పేద కుటుంబాలు కావడం, ఆయా కుటుంబాల బాధ్యత వారిపైనే ఉండడంతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


సంఘటనపై గవర్నర్‌ దిగ్భ్రాంతి

ఈనాడు హైదరాబాద్‌: శుక్రవారం యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం కుప్పకూలడంపై గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని