Crime News: న్యాయం కోసం వెళ్లిన బాలిక.. పీఎస్‌లోనే అత్యాచారం

న్యాయం కోసం వెళ్లిన బాలికపై పోలీసు స్టేషన్‌లోనే అత్యాచారం చేసిన దారుణమైన ఘటన ఇది.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌ జిల్లా పాలీ పోలీసుస్టేషన్‌లో ఈ సంఘటన చోటుసుకుంది. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ఎస్‌హెచ్‌ఓ

Updated : 05 May 2022 13:05 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌ జిల్లాలో ఘటన
నిందితుడు, మరో నలుగురి అరెస్టు

లలిత్‌పుర్‌: న్యాయం కోసం వెళ్లిన బాలికపై పోలీసు స్టేషన్‌లోనే అత్యాచారం చేసిన దారుణమైన ఘటన ఇది.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌ జిల్లా పాలీ పోలీసుస్టేషన్‌లో ఈ సంఘటన చోటుసుకుంది. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ఎస్‌హెచ్‌ఓ సహా ఐదుగురిని అరెస్టుచేశారు. ఎస్‌హెచ్‌ఓ తిలక్‌ధారి సరోజ్‌ను సస్పెండ్‌ చేశారు.

ఏప్రిల్‌ 22న మైనర్‌ బాలికను భోపాల్‌ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాలీ రైల్వే స్టేషన్‌ సమీపంలోనే బాధితురాలిని ఉంచిన నలుగురు నిందితులు వరుసగా మూడు రోజులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఏప్రిల్‌ 26న బాధితురాలిని పాలీ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో వదిలి వెళ్లిపోయారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్న ఎస్‌హెచ్‌ఓ అనంతరం ఆమెను అత్తతో పంపించేశారు. ఏప్రిల్‌ 27న వాంగ్మూలం నిమిత్తం బాధితురాలిని మళ్లీ స్టేషన్‌కు పిలిపించారు. ఆ రోజు సాయంత్రం స్టేషన్‌లోని ఓ గదిలోనే బాధితురాలిపై ఎస్‌హెచ్‌ఓ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాలికను ఆమె అత్తకు అప్పగించాడు. బాధితురాలిని కుటుంబసభ్యులు ఏప్రిల్‌ 30న చైల్డ్‌ లైన్‌కు అప్పగించారు. అక్కడ బాలికకు కౌన్సెలింగ్‌ ఇవ్వగా.. జరిగిన దారుణమంతా చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులందరిపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు చందన్‌, రాజ్‌భాన్‌, హరిశంకర్‌, మహేంద్ర చౌరాసియా, ఎస్‌హెచ్‌ఓతిలక్‌ధారి సరోజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బాలిక అత్తను కూడా నిందితురాలిగా చేర్చారు. పరారీలో ఉన్న ఎస్‌హెచ్‌ఓ తిలక్‌ధారి సరోజ్‌ను అరెస్టు చేసినట్లు ప్రయాగ్‌రాజ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రేమ్‌ ప్రకాష్‌ తెలిపారు. అలహాబాద్‌ హైకోర్టు సమీపంలో తిలకధారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు, ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

యోగి సర్కారుపై ప్రతిపక్షాల ఎదురుదాడి
అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో యూపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలు ఎదురుదాడికి దిగాయి. భాజపా సర్కారులో ప్రజలు ఎవరిని నమ్మాలో.. అర్ధం కావడం లేదంటూ అఖిలేశ్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని