Crime News: పెళ్లికి నిరాకరించిందని కాల్చేశాడు

తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిపై పగబట్టాడతను... ఎలాగైనా ఆమెను కడతేర్చాలనుకున్నాడు... ఇంట్లోకి ప్రవేశించి.. తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 10 May 2022 08:03 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు

అనంతరం తానూ షూట్‌ చేసుకొని ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో ఘటన

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: పొదలకూరు, న్యూస్‌టుడే: తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిపై పగబట్టాడతను... ఎలాగైనా ఆమెను కడతేర్చాలనుకున్నాడు... ఇంట్లోకి ప్రవేశించి.. తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన ఆలపాటి సురేశ్‌రెడ్డి (34) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా... అదే గ్రామానికి చెందిన కావ్య (24) పుణేలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కరోనా కారణంగా ఇద్దరూ రెండేళ్లుగా ఇళ్ల దగ్గర నుంచే పని చేస్తున్నారు. ఈ క్రమంలో కావ్యను ప్రేమించిన సురేశ్‌రెడ్డి ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. తన బంధువుల ద్వారా ఆమె తల్లిదండ్రులతో పలుమార్లు సంప్రదింపులు జరిపాడు. సురేశ్‌రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కావ్య చెప్పడంతో.. ఆమె తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదు. మళ్లీ ఒకటిన్నర నెల కిందట పెళ్లి ప్రతిపాదన పంపినా.. కావ్య అంగీకరించక పోయేసరికి సురేశ్‌రెడ్డి కోపం పెంచుకున్నాడు. తరచూ ఫోన్‌లు చేసి వేధిస్తుండటంతో అతని నంబర్లను కావ్య బ్లాక్‌ చేశారు. ఈ క్రమంలో ఆమెను అంతమొందించేందుకు నిందితుడు ప్రణాళిక రచించాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కావ్య తల్లిదండ్రులు బయటకు వెళ్లడాన్ని గమనించి వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తనతోపాటు తెచ్చుకున్న తుపాకీతో ఆమె తలపై కాల్చగా అక్కడికక్కడే కుప్పకూలారు. వెంటనే అక్కడి నుంచి పరారైన నిందితుడు కొంతదూరం వెళ్లి... అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేశ్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు... కావ్య, తన సోదరితో కలిసి పని చేసుకుంటున్నారు. కావ్య సోదరిని సురేశ్‌ పక్కకు నెట్టేశాడు. పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి కావ్యపై కాల్పులు జరిపాడు. మొదటి బుల్లెట్‌ గురి తప్పి వెళ్లి మంచానికి తగిలింది. మరోసారి కాల్చడంతో బుల్లెట్‌ ఆమె తలలో నుంచి దూసుకుపోయింది. ఈ దారుణాన్ని చూసిన కావ్య సోదరి నిర్ఘాంతపోయారు. అనంతరం తేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రక్తపుమడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కావ్యను అంబులెన్స్‌లో నెల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

తుపాకీపై మేడిన్‌ యూఎస్‌ఏ

సురేశ్‌రెడ్డిది వన్‌సైడ్‌ లవ్‌ అని, కావ్య పెళ్లికి ఒప్పుకోలేదని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ విజయరావు తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని కావ్య మృతదేహాన్ని పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తుపాకీపై మేడిన్‌ యూఎస్‌ఏ అని ఉందని, అది నిందితుడి చేతికి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

 


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts