Hardik Pandya: హార్దిక్‌ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ

హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్‌ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. 

Published : 10 May 2024 11:46 IST

ఇంటర్నెట్‌డెస్క్: హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోందని దక్షిణాఫ్రికా వెటరన్‌ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. రోహిత్‌, బుమ్రా వంటి అనుభవజ్ఞులున్న చోట అటువంటి శైలి జట్టుకు పెద్దగా ఉపయోగపడదని పేర్కొన్నాడు. ముంబయి జట్టులో తీవ్ర అసంతృప్తులున్నాయంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈ కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.

‘‘ముంబయి జట్టు ఈ సీజన్‌లో చాలా నిరాశపర్చింది. వారు నాకౌట్‌ దశకు చేరుకోవాలని నేను బలంగా కోరుకున్నాను. కానీ, సాధ్యం కాలేదు. ఎక్కడో లోపం జరుగుతోంది. ఇటీవల రోహిత్‌ మాట్లాడుతూ..‘నేను చాలా మంది కెప్టెన్లతో కలిసి ఆడాను. నాకు ఇదేం కొత్తకాదు. ఏం అవసరమో మీరు అది చేయండి.. నేను కూడా నెలరోజులుగా అదే చేస్తున్నాను’ అని వ్యాఖ్యానించాడు. మీరు ఈ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 

హార్దిక్‌ నాయకత్వం మైదానంలో ధైర్యంగా ఉన్నట్లున్నా.. అది ఓ రకంగా అహంకారపూరిత శైలి. అతడు మైదానంలో వ్యవహరిస్తున్న తీరు వాస్తవమైందని నేను అనుకోను. కానీ, తన కెప్టెన్సీ అలానే ఉండాలని అతడు అనుకొంటున్నాడు. ధోనీ మాదిరిగా చేద్దామని యత్నిస్తున్నాడు. అత్యంత అనుభవజ్ఞులున్న చోట అందరూ దానిని అంగీకరించరు. యువకులే అధికంగా ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌లో ఈ శైలి పనిచేస్తుంది. అనుభవం లేనివారు అటువంటి నాయకత్వాన్ని ఇష్టపడతారు. అంతేగానీ, రోహిత్‌, బుమ్రా వంటి వారున్న జట్టులో ఇది మంచి వ్యూహం కాదని నా అభిప్రాయం’’ అని పేర్కొన్నాడు.

ముంబయి జట్టులో అంతర్గతంగా ఉన్న అసంతృప్తులను సీనియర్లు మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ఓ మ్యాచ్‌ సందర్భంగా ఆటగాళ్లు, జట్టు కోచింగ్‌ సిబ్బంది సమావేశమయ్యారు. దీనిలో సీనియర్లు, జట్టు మేనేజ్‌మెంట్ బృందంతో ఒక్కొక్కరుగా మాట్లాడినట్లు తెలిసింది. దీనికి తోడు ఇటీవల దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి టాప్‌ స్కోరర్‌ తిలక్‌ వర్మను హార్దిక్‌ తప్పుపట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అతడికి మ్యాచ్‌ పరిస్థితిపై అవగాహన లేకపోవడమే ఓటమికి కారణమని హార్దిక్‌ వ్యాఖ్యానించాడు. ‘‘అక్షర్‌ పటేల్‌ (డీసీ బౌలర్‌) ఓ లెఫ్ట్‌ హ్యాండర్‌కు (తిలక్‌) బౌలింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో సదరు బ్యాటర్‌ అతడిపై దూకుడుగా ఆడి ఉండాల్సింది. ఆటపై ఉండే ఈ చిన్న అవగాహన లోపించడంతో మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకున్నాం’’ అని పేర్కొన్నాడు. ఏకపక్షంగా ఓటమి మొత్తాన్ని తనపై నెట్టేయడంతో తిలక్‌ వర్మ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని