‘ఫేస్‌బుక్‌’ వల కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ

పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాద ముఠా దేశ భద్రత రహస్యాలు, రక్షణ స్థావరాల కీలకమైన సమాచారాన్ని తస్కరించడంలో భాగంగా ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాతో రక్షణ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు వల వేసింది.

Published : 24 May 2022 04:16 IST

ఈనాడు, అమరావతి: పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాద ముఠా దేశ భద్రత రహస్యాలు, రక్షణ స్థావరాల కీలకమైన సమాచారాన్ని తస్కరించడంలో భాగంగా ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాతో రక్షణ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు వల వేసింది. దీనిపై తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేసు నమోదు చేసింది. ఈ ముఠా సభ్యులు... ఫేస్‌బుక్‌లో శాంతి పటేల్‌ పేరిట నకిలీ ఖాతా (ప్రొఫైల్‌) సృష్టించారు. భారతదేశ రక్షణ విభాగంలో పనిచేసే అధికారులు, సిబ్బందితోపాటు ఇతర వ్యక్తులను గుర్తించి వారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి పరిచయం పెంచుకున్నారు. అందమైన అమ్మాయిల చిత్రాలతో కూడిన ఓ ఫోల్డర్‌ను ప్రైవేట్‌ మెసెంజర్‌లో పంపించారు. ఆ చిత్రాలు చూడటానికి ఆ ఫోల్డర్‌పై క్లిక్‌ చేసిన వారి కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లలోకి మాల్‌వేర్‌ను చొప్పించారు. తద్వారా వాటిలోకి చొరబడ్డారు. అనంతరం ఆయా కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లలో నిక్షిప్తమై ఉన్న దేశ భద్రత రహస్యాలు, రక్షణ స్థావరాల కీలకమైన సమాచారాన్ని తస్కరించారు. ఈ ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పావులుగా మారారు. ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ సెల్‌) ఈ వ్యవహారంపై 2020 జూన్‌ 30న కేసు నమోదు చేసింది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాని ఆధారంగా కొత్త కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతలు చేపట్టింది. ఐపీసీలోని 120బీ, 121ఏ, 380, 416, 420 సెక్షన్లతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)లోని సెక్షన్‌ 18, అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్‌ 3, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66డీ, 66ఎఫ్‌ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఈ నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా నిర్వహిస్తున్నట్లు, వారే కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లలోకి మాల్‌వేర్‌లు చొప్పించి దేశ భద్రత రహస్యాలు కొల్లగొడుతున్నట్లు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ ప్రాథమికంగా గుర్తించింది. కీలకమైన భద్రత సమాచారాన్ని తస్కరించడం ద్వారా భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడాలనేది నిందితుల ప్రధాన ఉద్దేశమని తేల్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని