పిడుగుపాటుకు ముగ్గురి మృతి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శుక్రవారం పిడుగుల ధాటికి ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మరోముగ్గురు గాయాలపాలయ్యారు.

Published : 25 Jun 2022 05:19 IST

ముగ్గురికి గాయాలు

నార్నూర్‌, ఇచ్చోడ, చింతలమానెపల్లి-న్యూస్‌టుడే: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శుక్రవారం పిడుగుల ధాటికి ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మరోముగ్గురు గాయాలపాలయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం రాజులగూడ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు షేక్‌ అయ్యూబ్‌(45), లాడేవార్‌ ప్రహ్లాద్‌.. అదే గ్రామంలోని అంకుష్‌ రాఠోడ్‌ పంటచేనులోకి శుక్రవారం ఉదయం పనుల కోసం వెళ్లారు. మధ్యాహ్నం వర్షం ప్రారంభమవడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరిన వీరిపై పిడుగుపడింది. దీంతో అయ్యూబ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రహ్లాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రహ్లాద్‌ను చికిత్స కోసం ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు రౌతు రావూజీ(45) తన చేనులో పత్తి విత్తనాలు విత్తడానికి వెళ్లారు. కొద్దిసేపటికే పిడుగు పడటంతో కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందారు. కుటుంబ పెద్దల మరణంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(బి) గ్రామానికి చెందిన సుగుణ (30).. భర్త తుకారాం, చిన్నాన్న కుమారుడు మారుతితో కలిసి కొకస్‌మన్నూర్‌లో కౌలుకు తీసుకున్న చేనుకి వెళ్లారు. పత్తి విత్తనాలు విత్తే సమయంలో పిడుగు పడింది. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. తుకారాం, మారుతికి గాయాలవ్వగా.. వారిని చికిత్స కోసం బోథ్‌ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని