రూ.5.80 కోట్ల బంగారం స్వాధీనం

విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ పరిధిలో అతిపెద్ద స్మగ్లింగ్‌ రాకెట్‌ను అధికారులు ఛేదించారు. మూడు కార్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.5.8 కోట్ల విలువ బంగారాన్ని పట్టుకున్నారు.

Published : 27 Jun 2022 04:50 IST

భారీ స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించిన కస్టమ్స్‌ అధికారులు

ఈనాడు, అమరావతి: విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ పరిధిలో అతిపెద్ద స్మగ్లింగ్‌ రాకెట్‌ను అధికారులు ఛేదించారు. మూడు కార్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.5.8 కోట్ల విలువ బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నై నుంచి గుంటూరు, రాజమహేంద్రవరానికి భారీగా బంగారం, వెండి తరలిస్తున్నట్టు ఈనెల 24న కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన మూడు కార్లను వారు తనిఖీ చేశారు. కార్లలోని సీట్ల కింది భాగంలో ప్రత్యేక అరలను ఏర్పాటుచేసి వాటిలో బంగారం దాచిపెట్టారు. మూడు కార్లలో కలిపి 10.77 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని బిస్కెట్లు, నగల రూపంలో తరలిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం వీటి విలువ రూ.5.8 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కాకినాడ డివిజన్‌ కస్టమ్స్‌ అధికారులు జరిపిన తనిఖీల్లో రాజమహేంద్రవరం వద్ద ఒక్కొక్కటి కిలో బరువున్న 24 వెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై విదేశీ గుర్తింపు ముద్రలున్నట్టు అధికారులు వెల్లడించారు. బంగారం, వెండి స్మగ్లింగ్‌కు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ఆదివారం రిమాండ్‌కు పంపారు. 2014లో విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ ఏర్పాటుచేశాక ఇప్పటివరకూ ఛేదించిన స్మగ్లింగ్‌ కేసుల్లో ఇదే పెద్దదని అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని