జగిత్యాల జిల్లా వాసి అపహరణ

ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి.. నాలుగున్నరేళ్ల తర్వాత స్వగ్రామానికి తిరుగు పయనమైన వ్యక్తి అపహరణకు గురయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన

Published : 29 Jun 2022 05:23 IST

ఉపాధికి దుబాయ్‌ వెళ్లి వస్తుండగా ముంబయిలో ఘటన

విడిచిపెట్టేందుకు రూ.15 లక్షల డిమాండ్‌

పెగడపల్లి, న్యూస్‌టుడే: ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి.. నాలుగున్నరేళ్ల తర్వాత స్వగ్రామానికి తిరుగు పయనమైన వ్యక్తి అపహరణకు గురయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య(50) ఈ నెల 22న ముంబయి విమానాశ్రయంలో దిగి ఇంటికి వస్తుండగా కనిపించకుండా పోయిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ముంబయి నుంచి ప్రైవేటు బస్సులో జగిత్యాల వస్తున్నానని ఫోన్‌లో చెప్పిన శంకరయ్య ఇంటికి చేరుకోలేదని.. ఆయన భార్య అంజవ్వ, కూతురు గౌతమి తెలిపారు. దీంతో శంకరయ్య కుమారుడు హరీష్‌ ముంబయి వెళ్లి తండ్రి ఆచూకీ కోసం నాలుగు రోజుల పాటు వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో సోమవారం అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేరోజు ఆగంతుకులు ఇంటర్‌నెట్‌ ఫోన్‌ ద్వారా శంకరయ్య కుమారుడితో మాట్లాడారు. శంకరయ్య తమిళనాడులోని మదురైలో ఉన్నారని, డిపార్ట్‌మెంట్‌ వాళ్లు వేరొకరికి బదులు ఆయనను తీసుకొచ్చారని, మంగళవారం మధ్యాహ్నం బస్సులో చెన్నై నుంచి హైదరాబాద్‌ పంపిస్తామని హిందీలో చెప్పారు. మంగళవారం సాయంత్రం మరోసారి కాల్‌ చేసి శంకరయ్యను ఆయన కుమారుడితో మాట్లాడించారు. ‘రూ.15 లక్షలు ఇస్తేనే వదిలి పెడతామంటున్నారు. నేను బతికి ఉండాలంటే డబ్బులు తీసుకురమ్మని డిమాండ్‌ చేస్తున్నారు’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు.  ముంబయిలోనే ఉన్న కుమారుడు మరోసారి దీనిపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల ఎస్పీకి సైతం ఫిర్యాదు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శంకరయ్య క్షేమంగా ఇంటికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని