Crime news: రూ.5 లక్షలు ఇప్పిస్తే.. సరిపోదా?

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి నడిరోడ్డుపై పంచాయితీ చేయడం చర్చనీయాంశమైంది. విద్యుదాఘాతంతో చనిపోయిన లారీ డ్రైవరు ప్రాణానికి ఖరీదు కట్టడమే

Updated : 06 Aug 2022 09:45 IST

లారీడ్రైవరు ప్రాణానికి ఖరీదు కట్టిన ముత్తుకూరు ఎస్‌ఐ

పోలీసుస్టేషన్‌ ఎదుట నడిరోడ్డుపై డ్రైవర్లతో పంచాయితీ

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి నడిరోడ్డుపై పంచాయితీ చేయడం చర్చనీయాంశమైంది. విద్యుదాఘాతంతో చనిపోయిన లారీ డ్రైవరు ప్రాణానికి ఖరీదు కట్టడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించిన తోటి డ్రైవర్లను అరెస్టు చేస్తానని బెదిరించిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. పొదలకూరు మండలం కనపర్తికి చెందిన మురళీకృష్ణ(37) ముత్తుకూరు మండలం పంటపాడు సమీపంలోని ఓ నూనె కర్మాగారం పార్కింగ్‌ ప్రాంతంలో విద్యుదాఘాతంతో చనిపోయాడు. ఈ విషయమై ఎస్‌ఐ.. లారీ డ్రైవర్లను పిలిపించి మాట్లాడారు. వీడియోల్లో ఉన్న వివరాల మేరకు.. ‘పార్కింగ్‌ ప్రాంతం కంపెనీది అయినా.. అందరూ జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్తు తీగల కింద లారీ పెట్టి పైకి ఎందుకు ఎక్కాడు? తీగలు తగులుతాయన్న విషయం తెలియదా? అన్నింటికీ ఎవరో ఒకరిని బాధ్యులను చేయడం సరికాదు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చట్టప్రకారం కేసు పెట్టడం.. రెండోది కంపెనీతో మాట్లాడి మీకు న్యాయం చేయడం’ అని ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి చెప్పడంతో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కంపెనీ వైపు మాట్లాడుతున్నారేమని డ్రైవర్లు ప్రశ్నించడంతో.. ‘కంపెనీ నిర్లక్ష్యంతోనే చనిపోయాడని మీరంతా రాసివ్వండి. అప్పుడు కేసు పెట్టి.. విచారణ చేస్తాను. అంతేగానీ నాకు రూల్స్‌ చెప్పొద్దు. ఎస్‌ఐగా ఏం చేయాలో నాకు తెలుసు’ అని హెచ్చరించారు. ‘కంపెనీతో మాట్లాడి.. రూ.5లక్షలు ఇప్పిస్తే సరిపోదా.!’ అంటూ డ్రైవర్లపై మండిపడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన డ్రైవర్లు స్టేషన్‌ వైపు పరిగెత్తడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై నెల్లూరు గ్రామీణ డీఎస్పీ హరినాథరెడ్డిని వివరణ అడగ్గా.. ముత్తుకూరు ఎస్‌ఐపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల్లో వాస్తవం లేదన్నారు. అవన్నీ ఆరోపణలేనని తోసిపుచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని