కంటెయినర్‌ను ఢీకొన్న కారు.. అయిదుగురి మృతి

రోడ్డు ప్రమాదం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. కర్ణాటకలోని బీదర్‌ తాలూకా బంగూరు సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఈ దుర్ఘటనలో

Published : 16 Aug 2022 05:34 IST

బీదర్‌ సమీపంలో ప్రమాదం
బాధితులంతా హైదరాబాద్‌ వాసులే

న్యూస్‌టుడే- బీదర్‌, జహీరాబాద్‌ అర్బన్‌, నాగోల్‌- ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. కర్ణాటకలోని బీదర్‌ తాలూకా బంగూరు సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా హైదరాబాద్‌ నాగోల్‌ సాయినారాయణ కాలనీ రోడ్‌నెంబర్‌ 2లో భాగ్య అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. కలబురగి జిల్లా గాణిగాపుర (గంగాపూర్‌)లోని దత్తాత్రేయస్వామి దర్శనానికి వెళుతున్న సమయంలో కర్ణాటక- తెలంగాణ సరిహద్దులో ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు.. కంటెయినర్‌ను బలంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. హెడ్‌కానిస్టేబుల్‌ గోగి గిరిధర్‌ (48), సోదరుని పిల్లలు ప్రియ (15), మహేశ్‌ (2), అనిత (30), డ్రైవర్‌ జగదీష్‌(35) కన్నుమూశారు. తీవ్రంగా గాయపడిన కుటుంబసభ్యులు గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్ధన్‌లను బీదర్‌ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. గిరిధర్‌ తెలంగాణ పోలీసుశాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ముందుగా వెళుతున్న కంటెయినర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో వర్షపు జల్లుల్లో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న గిరిధర్‌ తల తెగి మధ్య సీట్లో కూర్చున్నవారిలో ఒకరి ఒడిలో పడింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు గుండెలవిసేలా రోదించడం చూపరుల కంటతడి పెట్టించింది.

రెండు నెలల కిందటే పదోన్నతి

ఎంతోకాలంగా ఎదురుచూసిన పదోన్నతి పొందిన ఆనందం.. కుటుంబంతో కలసి మొక్కులు తీర్చుకునేందుకు బయల్దేరిన గంటల వ్యవధిలోనే విషాదంగా మారింది. గిరిధర్‌ 1993 బ్యాచ్‌ కానిస్టేబుల్‌గా పోలీసు వృత్తిలో చేరారు. ఆయన భార్య జ్యోతి, పెద్ద కుమారుడు రాహుల్‌ ఐటీ ఉద్యోగి, చిన్న కొడుకు సుదర్శన్‌ డిగ్రీ చదువుతున్నాడు. సోమవారం ఉదయం వాహ్యాళికి వెళ్లొచ్చాక మొగల్‌పుర పోలీస్‌స్టేషన్‌లో జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం బేగంపేటలో ఉంటున్న సోదరుడు, స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం 10మంది కారులో బయల్దేరారు.

భర్త మరణం తెలియని భార్య

మొక్కు తీర్చుకునేందుకు బయల్దేరిన కుటుంబం క్షేమంగా ఇంటికి చేరాలని ఆ ఇల్లాలు భావించింది. వారి కోసం ఆమె సోమవారం ఉపవాసం పాటిస్తున్నారు. జ్యోతికి ప్రమాద సమాచారం చెప్పినప్పటికీ భర్త గిరిధర్‌ మరణించిన విషయాన్ని చెప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని