Crime News: సూదితో హత్య.. సూత్రధారి భార్యే

ఆమెది పచ్చని సంసారం. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి భార్యాభర్తలిద్దరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇంతలో ఆమె మరొకరితో వివాహేతర సంబంధం

Updated : 22 Sep 2022 10:52 IST

వివాహేతర సంబంధమే కారణం

పోలీసుల అదుపులో అయిదుగురు

ఈటీవీ, ఖమ్మం, ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమెది పచ్చని సంసారం. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి భార్యాభర్తలిద్దరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇంతలో ఆమె మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డుగా ఉన్నాడని అతడికి తనే మరణశాసనం రాసింది. ప్రియుడి సాయంతో భర్తను అంతమొందించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఇంజక్షన్‌ హత్య’ కేసు అసలు కథ ఇది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఖమ్మం గ్రామీణ ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. ఖమ్మం గ్రామీణ పోలీసు స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు వివరాలను ఆయన వెల్లడించారు. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్‌ జమాల్‌ సాహెబ్‌ (48) తాపీమేస్త్రి. అతని భార్య షేక్‌ ఇమాంబీ (46) వ్యవసాయ కూలీల ముఠా మేస్త్రి. ఆటోలో రోజూ కూలీలను తీసుకెళ్లే క్రమంలో నామవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ గోదా మోహన్‌రావుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారి రెండేళ్లుగా కొనసాగుతోంది. ఓ రోజు తన ఇంట్లో ఇమాంబీతో... మోహన్‌రావు సన్నిహితంగా ఉండటాన్ని చూసిన జమాల్‌ సాహెబ్‌ భార్యను మందలించాడు. దీంతో ఆమె కక్ష బూని.. భర్తను చంపేందుకు మోహన్‌రావుతో కలిసి పథక రచన చేసింది.

రెండు ఇంజక్షన్లు తెచ్చి..
కుట్రలో భాగంగా నామవరం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ బండి వెంకన్నను మోహన్‌రావు కలిశాడు. ప్రాణాలు తీయగల ఇంజక్షన్‌ కావాలని అడిగాడు. అందుకోసం రూ.3500 అడ్వాన్సుగా చెల్లించాడు. వెంకన్న తన స్నేహితుడైన యశ్వంత్‌ ద్వారా సాంబశివరావు అనే వ్యక్తి సాయం కోరాడు. సాంబశివరావు ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి రెండు ఇంజక్షన్లు తెచ్చి ఇచ్చాడు. మోహన్‌రావు వీటిని ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంకటేశ్‌ ద్వారా ఇమాంబీకి పంపాడు. జమాల్‌కు తొలుత నిద్రమాత్రలు ఇచ్చి.. ఇంజక్షన్‌ చేయాలని మోహన్‌రావు ఇమాంబీకి సూచించాడు. అది కుదరకపోవడంతో ఆమె ఇంజక్షన్‌ను మళ్లీ మోహన్‌రావుకు పంపేసింది.

భర్తను బయటకు రప్పించి..
హత్య పథకం అమలు కోసం ఇమాంబీ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచీ తనను తీసుకెళ్లేందుకు రావాలని భర్తను కోరుతోంది. దీంతో జమాల్‌ ఈ నెల 19న ఉదయం ద్విచక్ర వాహనంపై గండ్రాయికి బయలుదేరాడు. ఈ సమాచారాన్ని ఇమాంబీ మోహన్‌రావుకు ముందురోజు రాత్రే ఫోన్‌లో తెలిపింది. ద్విచక్ర వాహనం నంబరు ఇతర వివరాలు చెప్పి అదేరోజు చంపాలని ఒత్తిడి చేసింది. దీంతో మోహన్‌రావు ఆ పనిని ఆర్‌ఎంపీ వెంకన్న, వెంకటేశ్‌లకు అప్పగించాడు. వారిద్దరూ ముదిగొండ మండలం వల్లభి వద్ద కాపు కాశారు. తొలుత జమాల్‌ అనుకొని మరో వ్యక్తిని ఆపారు. అతను కాదని నిర్ధరించుకొని పంపించేశారు. తరువాత వచ్చిన జమాల్‌ను వెంకన్న లిఫ్ట్‌ అడిగి బైకు ఎక్కి కూర్చున్నాడు. ఇంజక్షన్‌ చేసి వెంటనే దిగి పారిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే జమాల్‌ మరణించాడు.

తెల్లవారుజామున ఫోన్లు..
హంతకుడు అపరిచితుడన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఇమాంబీ ఫోన్‌ కాల్స్‌నూ పరిశీలించారు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఆమె మోహన్‌రావు, వెంకటేశ్‌లకు పదేపదే ఫోన్లు చేసినట్లు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలింది. సూత్రధారి ఆమేనని తేలిపోయింది. ఈ కేసులో గోదా మోహన్‌రావు, బండి వెంకన్న, నర్సింశెట్టి వెంకటేశ్‌, షేక్‌ ఇమాంబీ, బందెల యశ్వంత్‌, పోరళ్ల సాంబశివరావులను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. కేసును 48 గంటల్లో ఛేదించిన గ్రామీణ సీఐ శ్రీనివాస్‌, రూరల్‌ ఎస్సై శంకర్‌రావు, కామేపల్లి ఎస్సై కిరణ్‌, ముదిగొండ ఎస్‌ఐ నాగరాజు, రఘునాథపాలెం ఎస్‌ఐ రవిలతోపాటు ఇతర సిబ్బందిని పోలీసు కమిషనర్‌ విష్ణు వారియర్‌ అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు