ముగ్గురు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం

ఆ తల్లికి ఏమైందో ఏమో గానీ ముగ్గురు పిల్లలతో పాటు ఆత్మహత్యకు యత్నించింది. ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా చెరువులో మునిగింది.

Published : 25 Sep 2022 04:51 IST

చెరువులో తల్లి, ఇద్దరు పిల్లల గల్లంతు

మహబూబ్‌నగర్‌ నేర విభాగం, నవాబుపేట, న్యూస్‌టుడే: ఆ తల్లికి ఏమైందో ఏమో గానీ ముగ్గురు పిల్లలతో పాటు ఆత్మహత్యకు యత్నించింది. ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా చెరువులో మునిగింది. తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతు కాగా పెద్ద కుమార్తె సురక్షితంగా బయటపడింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం కాకర్లపహాడ్‌ గ్రామానికి చెందిన అద్దాల మైబుకు అదే మండలంలోని కొత్తపల్లికి చెందిన రమాదేవి(35)తో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరు ఉపాధి కోసం నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వెళ్లి.. రాజేంద్రనగర్‌లోని అంబేడ్కర్‌ కాలనీలో నివసిస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. పెద్ద పాప నవ్య దేవరకద్రలోని ఎస్సీ బాలికల గురుకులంలో ఆరో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం రమాదేవి పండగకు ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఎనిమిదేళ్ల కవల పిల్లలు మేఘన, మారుతిలతో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు చేరింది. అక్కడి నుంచి దేవరకద్రలోని గురుకుల పాఠశాలలో ఉన్న పెద్ద కుమార్తె నవ్య వద్దకు వెళ్లింది. ఆమెకు పరీక్ష ఉండటంతో వేచిచూసింది. పరీక్ష పూర్తయ్యాక ఆమెను కూడా తీసుకొని మహబూబ్‌నగర్‌లోని తన అన్న ఇంటికి వచ్చింది. అతడు ఉండమన్నా వినకుండా.. కాసేపటికే ముగ్గురు పిల్లలతో కాకర్లపహాడ్‌కు బస్సులో బయలుదేరింది. గ్రామానికి సమీపంలోనే బస్సు దిగింది. పొలాల మీదుగా వెళ్దామని పిల్లలను నమ్మించి నల్లకుంట చెరువు వద్దకు తీసుకెళ్లింది. పెద్ద కుమార్తె వద్దంటున్నా వినకుండా పిల్లలను పట్టుకుని చెరువులో దిగింది. తల్లి, ఇద్దరు కవలలు నీటిలో మునిగిపోయారు. నవ్య తనకు అందిన చెట్టుకొమ్మను పట్టుకొని కేకలు వేసింది. చాలాసేపటి వరకు రోదిస్తూనే ఉంది. తర్వాత అటుగా వెళ్తున్న కొందరు వచ్చి నవ్యను రక్షించారు. సర్పంచి నర్సింహ, ఎస్‌ఐ శ్రీకాంత్‌, పోలీసులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని.. తల్లీపిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రమాదేవి ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియలేదు. తమకు ఏ గొడవలూ లేవని, త్వరగా ఇంటికి వెళ్లాలని మాత్రమే కోప్పడ్డానని భర్త మైబు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని